IPL: ఉప్పల్ మ్యాచ్ ప్రేక్షకులకు అలర్ట్, వాటిని తీసుకురావద్దన్న సీపీ
హైదరాబాద్: నగర క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బుధవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఫేవరేట్ జట్లు తలపడనున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో అభిమానులు మ్యాచ్ చూసేందుకు తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది.
ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. 2500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. స్టేడియం వద్ద 360 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సీటింగ్ సామర్థ్యం 39 వేలు ఉందని, స్టేడియం లోపల కూడా భారీగా పోలీసులను మోహరిస్తామని చెప్పారు.

అయితే, ప్రేక్షకులకు పలు సూచనలు చేశారు సీపీ తరుణ్ జోషి. ల్యాప్‌ట్యాప్, వాటర్ బాటిల్స్, బ్యానర్స్, లైటర్స్, సిగరెట్స్, బైనాక్యులర్స్‌పై నిషేధం ఉందని, స్టేడియం లోపలికి ఎలాంటి వస్తువులు తీసుకురావద్దని సీపీ స్పష్టం చేశారు. అయితే, బ్లూటూత్స్ అనుమతిస్తామన్నారు. స్టేడియం పరిసరాల్లో షీ టీమ్స్ నిఘా ఉందని తెలిపారు.బుధవారం నాటి మ్యాచ్‌కు మధ్యాహ్నం 3 గంటల ముందు నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని సీపీ తెలిపారు.
నాలుగు అంబులెన్స్‌లు, మెడికల్ టీమ్స్, ఫైర్ ఇంజిన్లను సిద్ధంగా ఉంచామన్నారు. టికెట్ కొనుగోలు చేసినవారి కోసం పార్కింగ్ సదుపాయం కల్పించామని తెలిపారు. స్టేడియం వద్ద బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ జోషి స్పష్టం చేశారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహణ కోసం పోలీస్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మరోవైపు, ఉప్పల్ మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల కోసం టీఎస్ఆర్టీసీ ఆ రూట్లలో బస్సులను ఎక్కువ సంఖ్యలో నడపనుంది.












Click it and Unblock the Notifications