తెలంగాణాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. అక్టోబర్ 24నుండి 13రోజులపాటు.. షెడ్యూల్ ఇదే!!
ఏఐసిసి నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో అక్టోబరు 24వ తేదీ నుండి కొనసాగనుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో ఉత్సాహంగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో తన పాదయాత్రను కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ అక్టోబర్ 24వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రం లో రాహుల్ గాంధీ పర్యటన కు సంబంధించి ఫైనల్ రూట్ మ్యాప్ సిద్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

13 రోజులపాటు రాహుల్ గాంధీ తెలంగాణా భారత్ జోడో యాత్ర
గతంలో అనుకున్నట్టుగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర 13 రోజుల పాటు సాగనుంది. రాహుల్ గాంధీ తెలంగాణలో మొత్తం 359 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. 13 రోజులపాటు రోజు వారీగా రాహుల్ గాంధీ పాదయాత్ర లో పాల్గొనే నియోజకవర్గాల జాబితాను కూడా టీపిపిసి సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ పాదయాత్ర మొదట మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ మండలం కృష్ణ గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్రంలో కి ఎంట్రీ ఇవ్వనుంది.

భారత్ జోడో యాత్ర షెడ్యూల్ ఇలా
మక్తల్ నియోజకవర్గంలో జరిగే తొలి రోజు యాత్రలో రాహుల్ గాంధీ కొడంగల్, నారాయణపేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు. రెండవ రోజు దేవరకద్ర నియోజకవర్గంలో జరగనున్న పాదయాత్రలో కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట నియోజకవర్గాల నేతలు రాహుల్ గాంధీ తో పాటు పాదయాత్రను కొనసాగిస్తారు.
మూడవరోజు మహబూబ్ నగర్ అసెంబ్లీలో నల్గొండ పార్లమెంట్ నేతలు పాల్గొంటారు. నాలుగవ రోజు జడ్చర్ల అసెంబ్లీ లో జగనన్న పాదయాత్ర లో నాగర్ కర్నూల్, ఖమ్మం లోకసభ పరిధిలోని నేతలు పాల్గొంటారు.

నియోజకవర్గాల వారీగా రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనే నాయకుల జాబితా సిద్ధం
ఐదవ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలో మహేశ్వరం, భువనగిరి లోక్సభ నియోజకవర్గ నేతలు పాల్గొంటారు. ఇక శంషాబాద్ లో ఆరో రోజు జరిగే యాత్రలో హైదరాబాద్లోని లోక్సభ సెగ్మెంట్ లతోపాటు, ఎల్బి నగర్, రాజేంద్ర నగర్, ఉప్పల్ నియోజకవర్గాల నేతలు పాల్గొంటారు. ఏడవరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేవెళ్ల, సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని నేతలు పాల్గొంటారు. ఎనిమిదవ రోజు బీహెచ్ఈఎల్ ప్రాంతంలో జరిగే యాత్ర లో మల్కాజ్గిరి, మహబూబాబాద్ పార్లమెంటు పరిధి నేతలు పాల్గొంటారు. తొమ్మిదవ రోజు సంగారెడ్డి లో జరిగే రాహుల్ గాంధీ పాదయాత్ర లో వరంగల్, మెదక్ లోక్సభ నేతలు రాహుల్ గాంధీతో కలిసి నడుస్తారు.

షెడ్యూల్ ఫిక్స్ చేసిన కాంగ్రెస్ .. భారత్ జోడో యాత్రకు రెడీ
పదవరోజు శంకరంపేట లో జరిగే రాహుల్ గాంధీ పాదయాత్ర కు ఆదిలాబాదు లోక్సభ సెగ్మెంట్లోని నేతలు హాజరవుతారు. 12వ రోజు జుక్కల్ లో జరిగే పాదయాత్రకు నిజామాబాదు లోకసభ నియోజకవర్గం నేతలు పాల్గొంటారు. ఇక చివరి రోజైన పదమూడవ రోజు భారత్ జోడో యాత్రలో భాగంగా కరీంనగర్ లో , లోకసభ లోని, అసెంబ్లీ సెగ్మెంట్ నేతలతోపాటు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూలును ఫిక్స్ చేసిన కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రకు సన్నద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications