సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు
న్యూఢిల్లీ: రైల్వేల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య కార్యక్రమాల అమలుకు పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హామీ ఇవ్వడం సంతోషకరమని రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.
బుధవారం లోకసభ ప్రశ్నోత్తరాల్లో రైల్వేశాఖ అభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఆధునీకరణ, బాండ్లు, జాయింట్ వెంచర్ కార్యక్రమాలపై తీసుకున్న చర్యలేమిటని, ఎన్ని విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని టిఆర్‌ఎస్ ఎంపి వినోద్‌కుమార్ ప్రశ్నించారు.
దీనిపై మంత్రి సురేష్ ప్రభు స్పందిస్తూ.. ఇటీవల తాను హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు రాష్ట్ర సీఎం కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు ఎంపిక చేసిన రైల్వేస్టేషన్ల ఆధునీకరణ ప్రణాళికల అమలుకు రాష్ర్టాల సహకారం అవసరం అని చెప్పగా.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.

రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం కావాలని కోరుతున్నామని కేసీఆర్ దృష్టికి తేగానే తప్పకుండా ఒప్పందం కుదుర్చుకుని భాగస్వామ్య సేవలందిస్తామని స్పష్టం చేశారన్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని సురేశ్‌ప్రభు చెప్పారు.
ఇటీవల తనతో ఢిల్లీలో సమావేశమైన ఇద్దరు తెలంగాణ డిప్యూటీ సీఎంలు, టీఆర్‌ఎస్ ఎంపీలు.. రైల్వే అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీనిచ్చారని తెలిపారు. ఇక తమ మంత్రిత్వశాఖ పనుల ప్రారంభానికి చొరవ తీసుకుంటుందని చెప్పారు.
దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం ఆమోదించగానే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. రైల్వేల అభివృద్ధికి సంయుక్త భాగస్వామ్య ఒప్పందాలతో కార్యక్రమాల అమలుకు ఇప్పటి వరకు తెలంగాణతోపాటు 17 రాష్ర్టాలు సమ్మతించాయని తెలిపారు. ముఖ్యమైన రాష్ర్టాలు ముందుకొస్తే రైల్వేల అభివృద్ధికి చాలా మేలు జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications