రా! ఇక్కడే కూర్చున్నా!!: జూపల్లిని సవాల్ చేసిన రావుల
హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టుపై చర్చకు వస్తానన్న తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖం చాటేశారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. తాను టిడిపి ఆఫీసులోనే వేచి చూస్తున్నానని, చర్చకు రావాలని ఆయన అంతకు ముందు అన్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జూపల్లి కోసం 3 గంటల పాటు ఎదురు చూశారని ఆయన అన్నారు. చర్చ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు వస్తానని సవాల్ చేసిన జూపల్లి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. చాలెంజ్ చేసే ముందు వాస్తవాలు గురించి ఆలోచన చేయాలని రావుల హితవు పలికారు. పాలమూరు ప్రాజెక్టుకు టీడీపీ వ్యతిరేకం కాదని రావుల చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.
తాను ఎప్పుడూ ఎన్టీఆర్ భవన్‌లోనే ఉంటానని, తెలంగాణ భవన్‌కో గాంధీభవన్‌కో మారబోనని ఆయన అన్నారు. మంత్రి రాలేదంటే భయపడ్డారని అనుకోవాలా అని ఆయన అడిగారు. భీమా ప్రాజెక్టుకు చంద్రబాబు ఒక్క రూపాయి ఖర్చు చేశాడని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని జూపల్లి కృష్ణారావు శుక్రవారం సవాల్ చేసిన విషయం తెలిసిందే.

త్వరలో దానికి సిద్ధంగా ఉండాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారంనాడే చెప్పి శనివారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వచ్చి కూర్చున్నారు. సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం భీమా ప్రాజెక్టులో అంతర్భాగమని మంత్రికి తెలియదా? అని శుక్రవారం ఆయన ప్రశ్నించారు.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే సంగంబండ రిజర్వాయర్ నిర్మాణమైన విషయాన్ని గుర్తుచేశారు.
ఆయా విషయాలపై మంత్రికి అవగాహన లేనట్టుందని, అందుకే టీడీపీ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖను నిర్వహించిన కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావులను సంప్రదించాలని జూపల్లికి సూచించారు. పాలమూరులో మరో రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయి ఒక్క ఏడాదిలోనే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు.












Click it and Unblock the Notifications