రాయల తెలంగాణపై మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: కేసీఆర్‌తోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్: రాయలతెలంగాణపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి. సూర్యాపేటలో బీఆర్ఎస్ జెండా పండగ సందర్భంగా గులాబీ జెండాను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక రాయలసీమ, రాయలతెలంగాణ ఇప్పుడు సాధ్యం కాదన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడమే రాయలతెలంగాణ డిమాండ్‌కు కారణమని అన్నారు.
అంతేగాక, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారమవుతుందని మంత్రి జగదీశ్ వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ అంశం వదిలి ఆంధ్ర ప్రజలు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు. అక్కడి ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెరమీదకు వచ్చిందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న పథకాలను చూసి.. చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. ఇది కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. తెలంగాణలో కలపండి లేకపోతే మా దగ్గరికి రండి అని కేసీఆర్‌ని ఆహ్వానిస్తున్నారని తెలిపారు. తెలంగాణ బంగారు తెలంగాణ మారినట్లుగానే.. సువర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమేనని గతంలోనే చెప్పారని గుర్తుచేశారు.
పాలకుల చిత్తుశుద్ధి లోపంతో ఇలాంటి డిమాండ్లు వస్తున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పరిపాలకులను మార్చండి సువర్ణాంధ్రగా మార్చుకోవాలని ఆంధ్ర ప్రజలకు సూచించారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, వెనుకబాటుకు కారణమైన పారిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు. అభివృద్ధి సాధించే నాయకత్వాన్ని ఎన్నుకునే దిశగా ఆంధ్ర ప్రజలు, నాయకులు ఆలోచించాలన్నారు మంత్రి జగదీశ్.
కాగా, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల రాయల తెలంగాణ కావాలంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రాలు విడిపోవడం కష్టం కానీ.. కలవడం పెద్ద విషయం కాదని అన్నారు. తెలంగాణతో రాయలసీమలోని కర్నూలు, అనంతరం రెండు జిల్లాలను కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇలా జరిగితే సీమకు నీటి కొరత తీరుతుందన్నారు. దీనిపై తెలంగాణ నేతలతో కూడా మాట్లాడినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి పై విధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications