
మూడోవిడత ప్రజాసంగ్రామ యాత్రకు సర్వం సిద్ధం.. నేడు మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ పూజలు
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడవ విడత ఆగస్టు 2వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. దీనికోసం బీజేపీ శ్రేణులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే బండి సంజయ్ రెండు విడతలు పాదయాత్ర నిర్వహించి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, బీజేపీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంతో పాటు, కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీని చూపించే ప్రయత్నం చేశారు.

మహా శక్తి అమ్మవారి ఆలయంలో నేడు బండి సంజయ్ పూజలు
ఇక తాజాగా మంగళవారం నుండి మళ్లీ పాదయాత్రను నిర్వహించనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నాడు మహా శక్తి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను రేపటి నుండి ప్రారంభించనున్నారు.
ఆగస్టు 2వ తేదీన బండి సంజయ్ యాదగిరిగుట్ట, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం తీసుకొని అక్కడ నుండే ప్రజా సంగ్రామ పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుండి ఆగస్టు 26వ తేదీ వరకు పాదయాత్రను కొనసాగించి 26వ తేదీన హనుమకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం దగ్గర పాదయాత్రను ముగించనున్నారు.

24 రోజులు .. 125 గ్రామాలు .. 328 కిలోమీటర్ల మేర పాదయాత్ర
మొత్తం ఇరవై నాలుగు రోజుల పాటు, నూట ఇరవై ఐదు గ్రామాల మీదుగా మూడు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. గత రెండు దఫాలుగా నిర్వహించిన పాదయాత్రల కంటే, ఈ దఫా పాదయాత్రను మరింత జోష్ తో నిర్వహించాలని బండి సంజయ్ టీమ్ భావిస్తున్నారు. టీఆర్ఎస్ అవినీతి, నియంతృత్వం, కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్నామని పదేపదే చెబుతున్న బీజేపీ నేతలు, మూడో విడత ప్రజా సంకల్ప యాత్ర కు తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాల మీదుగా ముందుకు సాగనున్నారు.

ప్రజా సంగ్రామ యాత్ర టీఆర్ఎస్ పై బీజేపీ పోరాటంలో భాగం
అంతేకాదు టీఆర్ఎస్ ప్రభుత్వం తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిందని మండిపడుతున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ . అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులు, వారి అనుచరులు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడడం, కుటుంబ పాలన, గూండాయిజంతో తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా మారారని విమర్శిస్తున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో భారతీయ జనతా పార్టీ సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్‌లతో ముందుకెళ్తోందని చెబుతున్నారు.

ప్రజలు భాగస్వాములు కావాలని బండి సంజయ్ పిలుపు
టీఆర్ఎస్ నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని ప్రజా సంకల్ప యాత్ర అందుకు ఉద్దేశించి ప్రారంభించిన యాత్ర అని బండి సంజయ్ పేర్కొంటున్నారు. ప్రజా తెలంగాణ కల సాధన కోసం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న క్రమంలో, టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా చేపడుతోన్న ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తోంది.