అర్థరాత్రి రియల్టర్ దారుణ హత్య: విమానంలో వ్యక్తి మృతి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం అర్ధరాత్రి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రియల్ వ్యాపారి, ట్రావెల్ ఏజెంట్ కుత్బుద్దీన్(58) హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న బండ్లగూడ అరోరా కళాశాల సమీపంలో నలుగురు వ్యక్తులకు భూమి చూపేందుకు వెళ్లాడు.
అర్ధరాత్రి సమయంలో అక్కడ నుంచి ఇంటికి బయల్దేరుతుండగా నాలుగు బైక్‌లపై వచ్చిన అగంతకులు కుత్బుద్దీన్‌ను బైక్‌లతో ఢీకొట్టారు. కిందపడిన అతడిని దుండగులు అక్కడ ఉన్న మొద్దుతో తలపై బలంగా కొట్టి చంపి పరారయ్యారు.

కుటుంబ తగాదాల నేపథ్యంలో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా పథకం ప్రకారం పాతనేరస్తులు సుపారీ తీసుకుని ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఇదిలావుంటే, ఓ విమాన ప్రయాణికుడు గుండెపోటుతో మృతిచెందాడు. కోల్‌కత్తాకు చెందిన దేవాసిస్ బెనర్జీ(51) తన మిత్రుడి వివాహ వేడుకలకు వచ్చాడు. ఉదయం తిరుగు ప్రయాణమై కారులో శంషాబాద్ ఎయిర్‌పోర్టు వస్తూ మార్గమధ్యంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.












Click it and Unblock the Notifications