ఎర్రజొన్న, కందులకు గిట్టుబాటు ధర కోసం ఆందోళన.. హరీశ్ జీ! రైతుల ఆందోళన పట్టించుకోండి
హైదరాబాద్: తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుస్తామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గతంలో పలు సార్లు చెప్పారు. అలా ఆయన ప్రకటన చేసిన ఆర్మూర్ ప్రాంతం విత్తన వ్యాపారుల గుప్పిట్లో చిక్కుకున్నది. ఆధునిక సాగులో రాణించే రైతులు సిండికేట్ వ్యాపారుల దెబ్బకు విలావిల్లాడుతున్నారు. ఉత్తర భారతం, విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉండటంతో అయినకాడికి కొనుగోలు చేసి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు.
పంట ధరను ప్రతిరోజూ తగ్గిస్తూ క్వింటాల్‌పై రూ.1800కు దిగజార్చారు. దీంతో కనీసం పెట్టుబడులు రాకపోగా అన్నదాతకు ఎకరాకు రూ.12 వేలకుపైగా నష్టం వాటిల్లుతోంది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో అందులో నిజామాబాద్ జిల్లాలోని వ్యవసాయ భూములు ఎర్రజొన్న విత్తన పంటల సాగుకు అనువుగా ఉన్నాయి. ఆర్మూర్ ప్రాంతంలోనే రైతులు 45వేల ఎకరాల్లో పైగా ఎర్రజొన్న పండిస్తున్నారు.

వికారాబాద్ జిల్లాలో అన్నదాతల ఆందోళనతో వెనక్కు తగ్గిన అధికారులు
ఇదిలా ఉంటే తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు చొరవతో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాలను రాత్రికి రాత్రే ఎత్తేయాలని మార్క్‌ఫెడ్ అధికారులు తీసుకున్న నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లాలో రెండు చోట్ల ధర్నాలు చేశారు. పురుగుల మందుతో ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. రైతుల ఆందోళనకు పలు పార్టీలు మద్దతు తెలపడంతో అధికారులు వెనుకడుగు వేసి కొనుగోలు కేంద్రాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కనుక మంత్రి హరీశ్ రావు ఎర్రజొన్న, కంది రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పాక్, బంగ్లా, సౌతాఫ్రికాల్లో ఎర్రజొన్నకు డిమాండ్లు ఇలా
దేశంలోనే 85 శాతం ఎర్రజొన్న విత్తనాల ఉత్పత్తి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సాగవుతోంది. మిగతా 15 శాతం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతంలో సాగవుతోంది. ఎర్రజొన్నలకు ఉత్తర భారత దేశంతోపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫిక్రా దేశాల్లో ఈ పంట సాగుకు మంచి డిమాండ్ ఉంది. అక్కడికి చేరేసరికి క్వింటాల్ ఎర్రజొన్నలు సాగు చేయడానికి సుమారు రూ.12 వేలు అవుతోంది. అదే పండించిన రైతుకు క్వింటాకు కనీసం రూ.2వేలు కూడా దక్కని పరిస్థితి నెలకొన్నది. ఆర్మూర్ ప్రాంతంలోని అంకాపూర్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 40కి పైగా విత్తన కంపెనీలు పని చేస్తున్నాయి.

క్వింటాల్ ఎర్రజొన్నపై భారీగా ధర ఇలా తగ్గిస్తున్న వ్యాపారులు
విత్తన వ్యాపారులు ప్రతియేటా అక్టోబర్, నవంబర్ నెలల్లో రైతులతో ముందస్తు కొనుగోలు ఒప్పందం చేసుకొని సిండికేట్ ధర నిర్ణయించేవారు. రైతుల ఆందోళనలతో ముందస్తు ఒప్పందాలకు తావులేకుండా పోయింది. అయినా, రుచిమరిగిన వారు ఊరుకోరు కదా. అందుకే వ్యాపారులు పంట రాగానే అదనుపై ధర తగ్గించేలా కుట్రపన్నారు. 'ఈసారి పంటసాగు విస్తీర్ణం, దిగుబడి బాగా వచ్చింది. ఇప్పటికిప్పుడు విక్రయిస్తే కనీసం క్వింటాల్ ఎర్రజొన్నకు రూ.2000 అయినా వస్తాయి.. లేదంటే ఇంకా తగ్గిపోతుంది' అని రైతులకు మాయమాటలు చెప్పి నమ్మబలుకుతున్నారు. అది నిజమేనని రైతులు నమ్మేలా.. వారం రోజుల్లోనే క్వింటాల్‌పై రూ.100 నుంచి రూ.200కి తగ్గించారు.

ఆందోళన బాట పట్టిన ఎర్రజొన్న రైతులు
మధ్య దళారీలు చివరకు క్వింటాల్ ఎర్ర జొన్న రూ.1800 పడిపోయేలా పథకం రచించారు. దీంతో రైతాంగం గత్యంతరం లేక రోడ్డెక్కి నిరసన తెలుపుతోంది. కొంతమంది రైతులు చేసేదేమీ లేక ఇప్పటికే 20శాతం పంటను క్వింటాల్ రూ.1800 చొప్పున అమ్మేసుకున్నారు. ఇకముందు ఇంకా ధర పడిపోయే అవకాశం ఉందని దళారులు ప్రచారం చేస్తూ రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎర్రజొన్న రైతులకు మద్దతు ధరపై నోరు విప్పకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

45 వేల ఎకరాల్లో ఎర్రజొన్న పంట సాగు ఇలా
ఆర్మూర్ డివిజన్‌లోని 110 గ్రామాల్లో 45వేల ఎకరాల్లో ఎర్రజొన్న సాగుచేశారు. ఎకరా సాగుకు రూ.45వేల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం దళారుల మయాజాలంతో క్వింటా ధర రూ.1800గా నిర్ణయిస్తున్నారు. ఈ ధర కూడా వస్తుందో రాదోననే భ్రమలు కల్పించేలా క్వింటాల్ రూ.1500 వరకు పడిపోయినట్టు ప్రచారం చేయటం గమనార్హం. ఇప్పటివరకు 20 శాతం పంట విక్రయించారు. ఎకరాకు 18 క్వింటాళ్ల చొప్పున దిగుబడి రాగా.. (క్వింటాకు రూ.1800 చొప్పున రైతు నుంచి కొనుగోలు చేయగా) రూ.32,400 మాత్రమే వస్తోంది. ఇది పెట్టిన పెట్టుబడితో పోల్చితే రూ.12వేలకు పైగా నష్టమే.

రేపు ఎర్ర జొన్న రైతుల చలో కలెక్టరేట్ ఆందోళన
ధరల్లో అన్యాయాన్ని నిరసిస్తూ ఎర్రజొన్న రైతాంగం ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్ధమౌతోంది. ఈనెల 9న ఎర్రజొన్న రైతులు చలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చారు. క్వింటాల్ రూ.1800 అంటే.. అంతకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఎర్ర జొన్నపై ధరను దళారులు చెప్పిందే వేదంగా ఉన్నదని రైతులు చెబుతున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు ధర ప్రకటన లేకపోవడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోర్తాడ్ రైతు చిన్న గంగారామ్ మాట్లాడుతూ క్వింటాకు రూ.4,500 చెల్లిస్తేనే గిట్టుబాటవుతుందని తెలిపారు. ఇప్పుడు ఉన్న ధరకు జొన్నలు విక్రయిస్తే కనీసం పెట్టుబడులు రావడం లేదని రైతులు వాపోతున్నారు.

రైతుల ఆందోళనతో వెనుకకు తగ్గిన అధికారులు
వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీ నారాయణ పూర్ గ్రామంలో కందుల కొనుగోలుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం రాత్రికి రాత్రి ఎత్తేయాలని అధికారులు నిర్ణయించడం రైతుల కళ్లు మండాయి. కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లాలో రెండు చోట్ల మంగళవారం ధర్నాలు చేశారు. పురుగుల మందు డబ్బాలు చేతబట్టుకొని, సమస్యను పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు. రైతులకు పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. కొనుగోలు కేంద్రాన్ని కనీసం నెల రోజులు కూడా కొనసాగించకుంటే పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 14రోజులు కేంద్రాన్ని కొనసాగించారని, అప్పుడూ దళారులు తెచ్చిన పంటకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని రైతులు వాపోయారు. వెంటనే ఆర్డీఓ, మార్క్‌ఫెడ్ అధికారులు కేంద్రం వద్దకు వచ్చి తిరిగి కందుల తూకాలు ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తక్షణం కందులు తూకం వేయాలని అధికారుల నిర్ణయం
కంది రైతులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నించినా వినలేదు. తాండూరు డీఎస్పీ రామచంద్రుడు ఫోన్‌లో రైతు నేతలతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ జ్యోతితో రైతుల ఎదుటే ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆదేశాల మేరకే కందుల కొనుగోలు కేంద్రాలను నిలిపేశామని ఆమె చెప్పారు. ఆ తర్వాత కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వారం రోజులుగా తూకాలు చేయని కందులను అక్కడే తూకం వేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నుంచి యాలాల తహసీల్దార్ అశోక్‌కుమార్ ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో ఆయన వెంటనే మార్క్‌ఫెడ్, డీసీఎంఎస్ నిర్వాహకులతో మాట్లాడి రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. ఇక నుంచి వచ్చే కందులను రైతులు ప్రధాన కేంద్రానికి తీసుకెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications