కేటీఆర్..ఓ జోకర్: రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: ఆర్మీ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల దుమారం చెలరేగుతోంది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆర్మీ అధికారుల నివాసాలకు నీరు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామంటూ అసెంబ్లీలో కేటీఆర్ జారీ చేసిన హెచ్చరికల పట్ల అభ్యంతరాలు వ్యక్తమౌతోన్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఈ విషయం మీద టీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలను సంధించింది.

కంటోన్మెంట్ బోర్డు పరిధిలో..
తాజాగా- ఆర్మీ అధికారులు సైతం దీనిపై స్పందిస్తోన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో భద్రత కారణాల వల్ల రోడ్లను ఆర్మీ అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. పౌరుల అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులను చేపట్టాలంటే కంటోన్మెంట్ బోర్డు అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. కంటోన్మెంట్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలను చేపట్టాల్సి ఉన్నా బోర్డు అనుమతి తప్పనసరి.

అభివృద్ధికి అడ్డంకిగా..
అదే సమయంలో- తమ అవసరాల కోసం ఈ ఏరియాలో ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకునే స్వేచ్ఛ ఆర్మీ అధికారులకు ఉంది. ఈ వ్యవహరం కాస్తా ప్రభుత్వ, ఆర్మీ అధికారుల మధ్య సమన్వయ లేమికి కారణమైంది. ఇదే అంశాన్ని మంత్రి కేటీఆర్ ఇటీవలే అసెంబ్లీలో ప్రస్తావించారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్డీపీ)పై మాట్లాడారు. ఆర్మీ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు వ్యవహారం నగర అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని స్పష్టం చేశారు.

చెక్‌డ్యాంల నిర్మాణంతో..
టోలీచౌకి ఏఎస్‌ఐ సమీపంలోని బోర్డు ప్రాంతంలో చెక్‌డ్యామ్‌లను ఆర్మీ అధికారులు నిర్మించుకున్నారని, దానివల్ల జనావాసాల్లోకి వరద నీళ్లు ప్రవహిస్తున్నాయని చెప్పారు. కంటోన్మెంట్ పరిధిలో రోడ్లను కూడా మూసేస్తున్నారని, దీనిపై ఇప్పటికే పలుమార్లు తాము అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే- కొన్ని కఠిన చర్యలను తీసుకోక తప్పదని అన్నారు. కంటోన్మెంట్‌కు విద్యుత్, నీటి సరఫరాను బంద్ చేస్తామని హెచ్చరించారు.
మేజర్ పవన్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు..
ఈ వ్యాఖ్యలపై తాజాగా శౌర్యచక్ర (రిటైర్డ్) అవార్డు గ్రహీత, మేజర్ పవన్ కుమార్ స్పందించారు. ఈ హెచ్చరికలను జారీ చేసిన కేటీఆర్‌ను ఆయన ఓ జోకర్‌గా అభివర్ణించారు. ఈ జోకర్ కేటీఆర్.. తెలంగాణలోని అన్ని కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రాంతాలకు నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేస్తాడట.. అని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నివసించే సైన్యాధికారులు, జవాన్ల వల్లే తాను స్వేచ్ఛా వాయువులను పీల్చ గలుగుతున్నాననే విషయాన్ని కేటీఆర్ మరిచిపోకూడదని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
Recommended Video

నెటిజన్ల కౌంటర్లు..
మేజర్ పవన్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు పలువురు నెటిజర్లు కౌంటర్ ఇస్తోన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో సామాన్య పౌరులు ఎదుర్కొంటోన్న సమస్యల ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 21 రోడ్లను మూసివేశారని, పౌరులు ఎలా రాకపోకలు సాగించగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. కంటోన్మెంట్ మీదుగా రాకపోకలు సాగించడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోన్నామని చెబుతున్నారు. దీనిపై ఇదివరకు దినపత్రికల్లో వచ్చిన క్లిప్పింగులను తమ ట్వీట్లకు జోడిస్తున్నారు.












Click it and Unblock the Notifications