మోడీ, అమిత్ షా కేసీఆర్ చేతిలో; అత్యాచారాలలోనూ ఎంఐఎం, టీఆర్ఎస్ పొత్తులు: రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. గురువారం నాడు గాంధీభవన్లో రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో భేటీ అయ్యారు. అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న ఆమ్నీషియా పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచార ఘటనపై తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని మండిపడిన రేవంత్ రెడ్డి తాజాగా మరోమారు కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు.

జూబ్లీహిల్స్ పబ్ కేసుపై రేవంత్ రెడ్డి ధ్వజం
రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి క్రైమ్ వెనుక టిఆర్ఎస్, ఎంఐఎం నేతలు ఉన్నారని మండిపడుతున్న రేవంత్ రెడ్డి ఆమ్నీషియా పబ్ కేసులో నిందితులు ఉపయోగించిన కార్లు ఎవరివి అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే ఆ వాహనాల యజమానులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పబ్ కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటూ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి పబ్ లు తెరిచి ఉంటే భౌతిక దాడులు చేస్తామంటూ, డ్రగ్స్ విష సంస్కృతికి అడ్డుకట్ట వేస్తామంటూ పేర్కొన్న రేవంత్ రెడ్డి అటు బిజెపి పైన కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉన్నారు
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కెసిఆర్ కు అధికారంతో పాటు బాధ్యత ఉంటుందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. బాధ్యతను స్వీకరించనప్పుడు రాజ్యాంగం తన పని తాను చేసుకుపోతోంది అంటూ వ్యాఖ్యానించారు. సెక్షన్ 8 ప్రకారం జంటనగరాల్లో గవర్నర్ కు సర్వాధికారాలు ఉంటాయని పేర్కొన్న రేవంత్ రెడ్డి అవసరం అనుకుంటే గవర్నర్ పరిపాలనను చేతిలోకి తీసుకోవచ్చని వెల్లడించారు.

గవర్నర్ పైనా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీకి గవర్నర్ ఏం చెప్పినా, మోడీ కెసిఆర్ మాటే వింటున్నారు అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అందుకే గవర్నర్ కేసీఆర్ గురించి చెప్పినా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. అత్యాచారాలలో కూడా టిఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నేతలు పొత్తులు పెట్టుకుంటున్నారు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలు క్రియాశీలక ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, కానీ రాష్ట్రంలో క్రియాశీలక ప్రభుత్వం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కెసిఆర్ సొంత రాజ్యాంగం రాసుకుంటా అంటే ఆయన ఇష్టం అని ఎద్దేవా
తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. సీఎం డిజిపి, హోమ్ మంత్రితో, సిపి ల తో కనీసం సమీక్ష చేయడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కెసిఆర్ సొంత రాజ్యాంగం రాసుకుంటా అంటే ఆయన ఇష్టం అంటూ ఎద్దేవా చేశారు. మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్న రేవంత్ రెడ్డి మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనల నేపథ్యంలో ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని తేల్చిచెప్పారు.

బీజేపీ, టీఆర్ఎస్ పంచాయితీ అత్తా కోడళ్ళ పంచాయితీ లెక్క
అత్తా కోడళ్ళ పంచాయతీ లెక్క టీఆర్ఎస్, బీజేపీ పంచాయితీ రాష్ట్రంలో కొనసాగుతుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టిఆర్ఎస్, బిజెపి నేతలు ఇద్దరూ కలిసే ఉన్నారని, కానీ బయటకి నటిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వాళ్ళిద్దరూ వేర్వేరు అని ఎప్పుడు అనుకోవద్దని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచుతున్నాడని చెప్పింది బిజెపినే అని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి అప్పులు తెచ్చుకోమని నాలుగు వేల కోట్ల అప్పులకు అనుమతి ఇచ్చింది బిజెపి కాదా అంటూ నిప్పులు చెరిగారు.












Click it and Unblock the Notifications