కేంద్రంతో కుమ్మక్కైన రేవంత్ రెడ్డి.. సింగరేణిపై కుట్ర: కేటీఆర్
సింగరేణిని ప్రైవేటీకరించేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వం వేలం వేసిందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నేడు తెలంగాణ భవన్లో సింగరేణి ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో సమావేశమైన ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ ను టార్గెట్ చేశారు.
మోడీ ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి కుమ్మక్కు
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణి గనులు కేటాయించకుండా నష్టాల్లోకి, కష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం సింగరేణి నష్టాల్లో ఉందని, ఆ తర్వాత పెట్టుబడుల ఉపసంహరణకు ప్రయత్నం చేస్తారని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. మోడీ ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగరేణి గనులను అమ్మకానికి పెట్టారు
పెట్టుబడుల ఉపసంహరణ కోసం రంగం సిద్ధం చేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రతి సింగరేణి కార్మికుడికి కాంగ్రెస్, బిజెపిలు కుమ్మక్కు రాజకీయాలు అర్థమవుతున్నాయని సింగరేణి గనులను అమ్మకానికి పెట్టిన విషయం ప్రతి కార్మికుడికి తెలుసని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మె కారణంగా సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందని కేటీఆర్ గుర్తు చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతమే తమ పార్టీ విధానం
ఈ సమ్మె జరిగిన సమయంలో దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలతో కేసీఆర్ ఉద్యమం నుంచే పని చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఉద్యమ కాలంలో కూడా అద్భుతంగా పనిచేశాయని కేటీఆర్ కితాబిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతమే తమ పార్టీ విధానం అని కేటీఆర్ స్పష్టం చేశారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా కుట్రలు చేస్తున్నారన్నారు.
కేసీఆర్ హయాంలో బొగ్గు గనుల వేలం అడ్డుకున్నాం
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం ఎంత పని చేసామో ప్రతి సింగరేణి కార్మికుడికి అవగాహన ఉందన్నారు కేటీఆర్. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ బొగ్గు గనులను వేలం వేయకుండా ఆపగలిగామని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రెండు బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కేటాయించినప్పటికీ తట్టెడు బొగ్గును కూడా తియ్యనివ్వకుండా విజయవంతంగా అడ్డుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు.
సింగరేణి కోసం బీఆర్ఎస్ పోరాటం
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు కాకముందే బిజెపితో కుమ్మక్కై బొగ్గు గనులను వేలం పెట్టిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సింగరేణి కోసం పోరాటం చేస్తుందని, సింగరేణిని కాపాడుకుంటామని కేటీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications