'కేసీఆర్ లో చొరబడ్డ వైఎస్ ఆత్మ', తల తోకా లేని వ్యవహారమన్న కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గతంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం కింద మార్చిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ప్రస్తుత సీఎం కేసీఆర్ ను ఆవహించిందని ఎద్దేవా చేశారు రేవంత్.
వైఎస్ ఆత్మ ఆవహించినందువల్లే.. కేసీఆర్ కూడా రీడిజైనింగుల పేరుతో ప్రాజెక్టులను ధనయజ్ఞం కింద మార్చారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడు కేబినెట్ మంత్రిగా హరీశ్ రావే ఆ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశారన్నారు రేవంత్.
ఓవైపు ఏపీలోని కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తో అంటకాగుతుంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం పోరాడుతామంటున్నారని, కాంగ్రెస్ కు చెందిన ఓ ఎంపీ గులాబీ గూటికి చేరినా ఇప్పటిదాకా ఫిర్యాదు చేసిన దాఖలా లేదని అన్నారు రేవంత్. ఈ మొత్తం వ్యవహారం చూస్తోంటే టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతల పోరాట పటిమ ఏపాటిదో అర్థమవుతోందన్నారు.
తలా తోకా లేని ప్రజెంటేషన్ : కేటీఆర్

తెలంగాణ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజేంటెషన్ ను తలతోకా లేని వ్యవహారంగా అభివర్ణించారు ఐటీ మంత్రి కేటీఆర్. ఇంజనీర్లు, నిపుణులు సైతం ఆ ప్రజెంటేషన్ ను తప్పుబడుతున్నారని కేటీఆర్ చెప్పారు. అధికారానికి ఎక్కడ శాశ్వతంగా దూరమవుతామేమోనన్న భయంతోనే కాంగ్రెస్ వర్గాలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు కేటీఆర్. ఇక ఫిరాయింపులకు సంబంధించి.. స్పీకర్ కు సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులపై స్పందించిన కేటీఆర్.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. వృద్ధిరేటు విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందంజలో ఉందని, అవినీతికి ఆస్కారం లేని పాలనను అందించేందుకు పారదర్శక విధానాలను అనుసరిస్తున్నామని తెలిపారు కేటీఆర్.












Click it and Unblock the Notifications