జీవితకాల ప్రత్యర్థులు కలిసి పని చేస్తారా?: రేవంత్, ‘టిఆర్ఎస్‌కు పోటీ వారే’
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ద్రోహులు, కబ్జాదారులతో నిండిపోయిందని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు సేవ చేసే నాయకులు కరవయ్యారని మండిపడ్డారు.
గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జీవితకాల ప్రత్యర్థులైన కొండా మురళి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరిలు ఒకే పార్టీలో చేరి ఎలా ప్రజలకు సేవ చేస్తారని ఆయన ప్రశ్నించారు.
ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తన కబ్జాల పర్వాన్ని కొనసాగించడానికి తన తమ్ముడ్ని బరిలో నిలిపారని మండిపడ్డారు. వరంగల్ అభివృద్ధికి టిడిపి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్నికలప్పుడు రాబంధుల్లా వాలడం తప్ప కేసీఆర్ బంధువులకు వరంగల్ ప్రజలపై ఎంతమాత్రం ప్రేమ లేదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రజా సమస్యలు, సంక్షేమం టిఆర్ఎస్‌కు పట్టవని మండిపడ్డారు. 14 ఏళ్లు ఉద్యమంలో ఉన్నవాళ్లను కాదని కబ్జాకోర్లు, అక్రమార్కులకు టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించండని రేవంత్ కోరారు.

కనుమరుగే: కడియం
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర క్రియాశీలకంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్న ఆయన పలు అంశాలపై మాట్లాడారు.
ప్రజల మద్దతు ఉన్న పార్టీలకే ఎప్పటికైనా మనుగడ ఉంటుందని, రాష్ట్రంలో ప్రజల మద్దతులేని పార్టీలు కనుమరుగవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో తమకు ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ లేదని, పోటీ అంతా టిఆర్ఎస్ తిరుగుబాటు దారుల నుంచేనన్నారు.
హరీశ్ రావు రోడ్ షో
రాష్ట్ర మంత్రి హరీష్‌రావు వరంగల్‌లో గురువారం రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు వరంగల్‌కు చేసిందేమీలేదని విమర్శించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అధికారంలో ఉన్నపుడే చేయలేని వాళ్లు ఇప్పుడేం చేస్తారని అన్నారు. తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కర్యాక్రమాలు చేపట్టిందని తెలిపారు.
వరంగల్ అభివృద్ధి కోసం ప్రతీయేటా రూ.300 కోట్లు కేటాయిస్తామని తెలిపారు. వరంగల్‌కు 15 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించామని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని అందిస్తామన్నారు.
ఏప్రిల్ నుంచి తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటువేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications