నిర్మల్ నుండే కాంగ్రెస్ ప్రభంజన యాత్ర షురూ .. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపైన రేవంత్ రెడ్డి ధ్వజం
సామాన్యులకు భారంగా మారిన, పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి.

నిర్మల్ జిల్లాలో ఆందోళనలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈరోజు నిర్మల్ జిల్లాలో ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి రాకతో దూకుడుగా ముందుకు కదిలారు. సైకిళ్లు, ఎడ్లబండ్లు, రిక్షాలతో భారీ ర్యాలీ నిర్వహించి డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై తమ నిరసనను వ్యక్తం చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్రోల్,డీజిల్ ధరల పెంపుతో పేదోడి రక్తం తాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా నిర్మల్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్
ఆపై ఎడ్లబండిపై తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఏలో అధికారంలో ఉన్న సమయంలో క్రూడాయిల్ ధర లీటర్ కు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 రూపాయలు ఉందని, అప్పుడు లీటర్ పెట్రోల్ ధర 71 రూపాయలు ఉంటే ఇప్పుడది 105 రూపాయలకు చేరుకుందని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభంజన యాత్రను నిర్మల్ నుంచి షురూ చేశారు అని చెప్పారు రేవంత్ రెడ్డి .
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ ప్రజల జేబులు లూటీ
రాంజీగోండు, కొమురం భీం స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం తీసుకురావడానికి యాత్ర మొదలు పెట్టాను అన్నారు. కాంగ్రెస్ కు అధికారం కొత్త కాదని పేర్కొన్న రేవంత్ రెడ్డి అధికారం కోసం తహ తహ లాడుతూ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ ప్రజల జేబులు లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి అని పేర్కొన్న రేవంత్ రెడ్డి పెట్రోల్ ధర పై కాంగ్రెస్ కుట్ర ఆడుతుంటే ప్రశ్నించే గొంతుకతో జనం కూడా కదం తొక్కారని పేర్కొన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలపై రేవంత్ రెడ్డి ధ్వజం
డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటూ కేసీఆర్, డబుల్ అభివృద్ధి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కాలం వెళ్లదీస్తున్నారు అని విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి మరీ పన్నులు పెంచుతూ పేద ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ పెంపుతో పాటుగా ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజలు ఎన్నడూ లేనంత ఆర్థిక భారాన్ని మోస్తున్నారని పేర్కొన్న రేవంత్ రెడ్డి అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రజలకు అండగా ఉంటామని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications