మోడీ ఇచ్చిన హామీ ఏమైంది?: మోసం చేశారని కవిత, అరవింద్‌పై రేవంత్ ఫైర్
నిజామాబాద్: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం రాత్రి నిజామాబాద్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసినప్పుడు వందరోజుల్లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తానని కవిత హామీ ఇచ్చారని సీఎం రేవంత్ గుర్తు చేశారు.
రైతులకు మాట ఇచ్చి మోసం చేస్తే, బండకేసి కొడతామని నిజామాబాద్ రైతులు నిరూపించారన్నారు రేవంత్. గెలిచిన 5 నెలల్లో పసుపుబోర్డు తెస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చారని, పసుపుబోర్డు తెస్తానని చెప్పిన ఆయన కూడా మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

పదేళ్లు అధికారంలో ఉన్న మోడీ ఎన్నికల ముంగిట పసుపుబోర్డు ప్రకటన చేశారని.. గుజరాత్, యూపీలో ప్రకటన చేస్తే పదేళ్లు నెరవేరకుండా ఉంటుందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలంటే మోడీకి చులకన, సులువుగా మోసం చేయొచ్చని భావిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్మూర్‌కు కనీసం మున్సిపాలిటీ కార్యాలయం కూడా తేలేదని, నిజామాబాద్, ఆర్మూర్‌ను ఇక్కడి నేతలే మోసం చేశారని రేవంత్ విమర్శించారు.
పంజాబ్, హర్యానా రైతులు మోడీ మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేయించారని.. నిజామాబాద్, ఆర్మూర్ రైతులు కూడా ఉత్తరాది రైతుల వలే పోరాడాలన్నారు సీఎం రేవంత్. చక్కెర కర్మాగారం తెరిపించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, రూ.42 కోట్ల బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు.
పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సవాలు విసిరానని.. ఆ మాట నిలబెట్టుకుంటామన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీశ్‌రావు అన్నారని గుర్తు చేశారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ పూర్తవుతుందని, సిద్దిపేటకు హరీశ్‌రావు శని వదులుతుందని చెప్పుకొచ్చారు. పసుపుబోర్డు తెచ్చుకోవాలంటే నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications