111 జీవో వెనుక ఇన్‌సైడ్ ట్రేడింగ్: సీఎం ఫ్యామిలీ పాత్ర అంటూ రేవంత్ సంచలనం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. 111 జీవో ఎత్తివేత వెనుక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించారు రేవంత్. 111 జీవో పరిధిలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భూములు కొన్నారని సంచలన ఆరోపణలు చేశారు. భూములు కొనుగోలు చేశాక జీవో ఎత్తివేశారని విమర్శించారు. 111 జీవో ఎత్తివేతపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తామన్నారు.
2019 జనవరి తర్వాత 111 జీవో పరిధిలో భూముల క్రయ విక్రయాల వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఔటర్ రింగురోడ్డును ముంబైకి చెందిన ఐఆర్‌బీ(IRB) సంస్థకు అమ్మారని.. ఓఆర్ఆర్‌ను అప్పనంగా ప్రైవేటు కంపెనీకి అప్పగించారని ఆరోపించారు. సింగపూర్ సంస్థ ఫ్రంట్ ఎండ్లో ఉండి వాటా కొనుగోలు చేసిందన్నారు. ఓఆర్ఆర్ టెండర్ల ప్రక్రియ మొదలు బిడ్ ఖరారు వరకు జరిగిన అక్రమాలను కాంగ్రెస్ చెబుతూ వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.

టెండర్ సాధించిన వారికి అగ్రిమెంట్ లెటర్ తర్వాత 30 రోజుల్లో 10 శాతం చెల్లించాలన్నారు. రూ. 738 కోట్లను 30 రోజుల్లో IRB సంస్థ HMDAకు చెల్లించాలని పేర్కొన్నారు. మే 26వ తేదీ వరకు IRB సంస్థ 10శాతం హెచ్ఎండీఏ కు చెల్లించపోతే టెండర్ వెంటనే రద్దు చేయాలన్నారు. 10శాతం కట్టకుండానే ఎందుకు పొడిగింపు ఇస్తున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
సీఎస్ సోమేశ్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ఈ తతంగమంతా నడిపిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కుమార్.. కేసీఆర్, కేటీఆర్‌కు తాబేదారా అని ప్రశ్నించారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే HMDAను ముట్టడిస్తామని హెచ్చరించారు.తాను లోక్‌సభ ఎంపీనని.. తనన ఎందుకు అరవింద్ కుమార్ కలవడని ప్రశ్నించారు. ఈడీ, కాగ్ సంస్థలకు తమ దగ్గరున్న సమాచారం ఇస్తామన్నారు. ఇంత అవినీతి జరుగుతున్నా బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications