కేసీఆర్ ఆట!: 'టైగర్'గా రేవంత్ మరింత పెంచారు, బాబుకి అదే గతి: జూపల్లి
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి దూకుడు మరింత పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఓటుకు నోటు వ్యవహారం ముందు కేసీఆర్ పైన రేవంత్ నిప్పులు చెరిగేవారు. ఓటుకు నోటు కేసులో నెల రోజుల పాటు జైలులో ఉన్నారు. బుధవారం ఆయన విడుదలయ్యారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో కెసిఆర్ పైన రేవంత్ దూకుడు తగ్గిస్తారేమోనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, గతంలో మాదిరిగానే.. ఇంకా చెప్పాలంటే అంతకంటే దూకుడు రేవంత్ రెడ్డిలో కనిపించింది. విద్యార్థుల ఆత్మహత్య నుండి మొదలు రాజీనామా చేయకుండానే మంత్రి పదవులు పొందడాన్ని రేవంత్ ప్రశ్నించారు.
సన్నాసి, బద్మాసి అంటూ విరుచుకు పడ్డారు. తన కూతురు నిశ్చితార్థం సమయంలో బెయిల్ కోసం రేవంత్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు కోర్టు నిబంధనలు పాటించారు. బెయిల్ వచ్చాక కూడా కోర్టు నిబంధన మేరకు తన నియోజకర్గం కొడంగల్ వెళ్లారు.

రేవంత్ వ్యాఖ్యల పైన టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. అయితే, ఇన్నాళ్లు కేసీఆర్ దాదాపు అదే భాషను ఉపయోగించారని, ఇప్పుడు రేవంత్ ఉపయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
రేవంత్ భాష సాక్ష్యులను బెదిరించేలా ఉందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే, రాజకీయ పార్టీ నేతగా రేవంత్ అధికార పార్టీ తీరును ఎండగట్టారని, కేసుకు దానికి ఏం సంబంధమని, కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి రేవంత్ మాట్లాడలేదని ఇంకొందరు చెబుతున్నారు.
చర్లపల్లి జైలు నుంచి రేవంత్ విడుదలయ్యాక భారీ ర్యాలీతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తీసుకు వెళ్లారు. టీడీపీ నేతలు ఆయనను భుజానికెత్తుకున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు రేవంత్ రిలీజయ్యారు. భారీ ర్యాలీతో ఇంటికి చేరుకునేసరికి అర్ధరాత్రి పన్నెండు అయింది.
ర్యాలీలో ఆద్యంతం రేవంత్‌ను టైగర్‌తో పోలుస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆట ప్రారంభమైందంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ... కేసీఆర్ ఆట ప్రారంభించారని, టీడీపీ ముగిస్తుందని చెబుతున్నారు.
చంద్రబాబుకు రేవంత్ గతే: జూపల్లి
ఓటుకు నోటు కేసులో టీఆర్ఎస్, టీడీపీల మధ్య మాటల తూటాలు పలుతున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణా రావు గురువారం మాట్లాడుతూ.. చంద్రబాబుకు రేవంత్ గతే పడుతుందని హెచ్చరించారు. బాబుకు జైలు తప్పదన్నారు. రేవంత్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలకు టీడీపీయే కారణమని ఆరోపించారు.












Click it and Unblock the Notifications