అవును, దొడ్డు బియ్యం పాలిష్: ఈటెలకు రేవంత్ రెడ్డి రిప్లై
హైదరాబాద్: హాస్టళ్లలో విద్యార్తులకు దొడ్డు బియ్యం పాలిష్ చేసి సన్నబియ్యంగా సరఫరా చేస్తున్న విషయం వాస్తవమని తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేస్తే సన్న బియ్యంగా మారవని మంత్రి ఈటెల రాజేందర్ చేసిన ప్రకటనను ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు.
సంక్షేమ పథకాల అమల్లో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్టళ్లలోని వసతులను పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వసతి గృహాల్లో విద్యార్థిల పరిస్తితిపై వివరించామని, మంత్రి వసతి గృహాల్లో తనిఖీలు నిర్వహిస్తారని ఆశించామని ఆయన అన్నారు

అయితే టిడిపి నేతలు ఎన్నడైనా వసతి గృహాలకు వెళ్లారా అని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే మంత్రి ఈటెల రాజేందర్ పనిచేస్తున్నారని ఆయన తప్పు పట్టారు. బలహీన వర్గాల వసతి గృహంలో తాము బియ్యాన్ని సేకరించామని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలోని వసతిగృహాల్లోని పరిస్థితులను పరిశీలించామని ఆయన చెప్పారు
తాము ఎక్కడ కూడా పరుష పదజాలం వాడలేదని, ఉన్నతాధికారులను విమర్శించలేదని చెప్పారు. తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్‌పై తమకు గౌరవం ఉందని అన్నారు.
ఇదిలావుంటే, రైతు ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెసు నాయకుడు జీవన్ రెడ్డి అన్నారు. రైతుల బ్యాంక్ రుణాలు రీషెడ్యూల్ కాకుండా చేశారని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే హరిత విప్లవం వస్తుందని అనుకున్నామని ఆయన అన్నారు. లక్ష కోట్ల బడ్జెట్‌లో రైతులకు 8,500 కోట్లు కేటాయించలేరా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications