చూసుకుని మురవాలి.. చెప్పుకుని ఏడ్వాలి; రాహుల్ గాంధీకి కవిత ప్రశ్నలకు రేవంత్ రెడ్డి కౌంటర్
తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీ పర్యటనను టార్గెట్ చేసి ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి నేర్చుకోడానికి వస్తున్న రాహుల్ గాంధీ కి స్వాగతం అంటూ కవిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై పార్లమెంట్లో ఎన్నిసార్లు రాహుల్ గాంధీ ప్రస్తావించారో చెప్పాలంటూ కవిత రాహుల్ గాంధీకి ప్రశ్నాస్త్రాలు సంధించారు.

ఎమ్మెల్సీ కవిత కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి
ఇక ఎమ్మెల్సీ కవిత కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. శ్రీమతి కవిత గారు రాహుల్ గాంధీని ప్రశ్నించే ముందు మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కవిత ను డిమాండ్ చేశారు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించారు. తండ్రి మోడీ ముందు మోకరిల్లి తెలంగాణ నుండి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్ళు బిగించినప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పాలని కవితను నిలదీశారు.

కవితకు రేవంత్ రెడ్డి ప్రశ్నాస్త్రాలు .. సమాధానం చెప్పండి
వరి వేస్తే ఉరే అని మీ తండ్రి ప్రవచనాలు చెప్పి ఆయన ఫాంహౌస్లో 150 ఎకరాలలో వరి పంట వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో మిర్చి రైతులు పిట్టల్లా రాలిపోతుంటే మీరు ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు. రైతుకు లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తానని మీ తండ్రి పచ్చి మోసానికి ఒడిగడితే ప్రశ్నించాల్సిన మీరు ఎక్కడున్నారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు అవసరమైన 26 లక్షల టన్నుల ఎరువులు ఫ్రీగా ఇస్తామని చెప్పిన మీ తండ్రి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు అర క్వింటాల్ ఎరువులు కూడా ఇవ్వలేదు మీరు ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించారు.

మీరు ఎక్కడున్నారు కవిత సమాధానం చెప్పండి
ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీతో కలిసి మీరు ఆడిన డ్రామాలతో ఆలస్యం చేయడం వల్ల చాలా మంది రైతులు ఇప్పటికే మద్దతు ధర కంటే చాలా తక్కువగా 1400 రూపాయలకి అమ్ముకుంటున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అకాల వర్షాలతో కల్లాలలో ధాన్యరాశులు తడిసి రైతులు భోరున విలపిస్తున్నారు. వారి కష్టం పట్టించుకోకుండా మీరు ఎక్కడున్నారు కవిత సమాధానం చెప్పండి అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక కవిత ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి చూసుకొని మురవాలి చెప్పుకొని ఏడవాలి అంటూ కెసిఆర్ సర్కారు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.












Click it and Unblock the Notifications