
కాళేశ్వరం అవినీతిపై మాటలు సరే.. చర్యల సంగతేంటి: కేంద్రమంత్రికి రేవంత్ రెడ్డి చురకలు
తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో బిజెపి, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పదేపదే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై, సీఎం కేసీఆర్ అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు మండి పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలు మరోమారు ఇరు పార్టీల మధ్య రాజకీయ రగడకు కారణంగా మారాయి.
ఆ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన ఆరుగురు ప్రముఖులు ఎవరు? ఐటీదాడులతో ఆసక్తికరచర్చ!

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతిపై మండిపడిన గజేంద్ర సింగ్ షెకావత్
తాజాగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అమలులో అవినీతి హద్దులు దాటిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు చట్టబద్ధమైన అనుమతులు లేవని, డిజైన్లు సాంకేతికంగా లోపభూయిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ క్రింద ఉన్న మూడు పంప్‌హౌస్‌లు మునిగిపోయాయని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వేల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు.

కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న కేంద్ర జలశక్తి మంత్రి
ఇప్పుడు మళ్లీ నీటిలో మునిగిన పంప్‌హౌస్‌లు, మోటార్‌ల మరమ్మతులు, పునరుద్ధరణలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడే అవకాశం ఉందని షెకావత్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ కలల ప్రాజెక్టుగా చూపించి అందరినీ మోసం చేసిందని మండిపడ్డారు. పంప్ హౌజ్‌లు, మోటార్ల ఏర్పాటును సాంకేతికంగా అంచనా వేయలేదని, సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో పంప్‌హౌస్‌ల నిర్మాణం సరిగా జరగలేదని, మోటార్లు సరిగ్గా అమర్చడంలో విఫలమయ్యారని షెకావత్ ఆరోపించారు.

షెకావత్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి చురకలు
ఇక కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలపై టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనేకమార్లు కాళేశ్వరం ప్రాజెక్టు పై కేంద్ర జలశక్తి శాఖకు, నీతి ఆయోగ్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తన పోస్టు ద్వారా అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా గజేంద్ర సింగ్ షెకావత్ ను టార్గెట్ చేసిన టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి షెకావత్ జీ... మీ తీరు చూస్తుంటే అరిచే కుక్క కరవదు అన్న సామెత గుర్తొస్తోంది అంటూ ఎద్దేవా చేశారు.

మాటలు సరే... చర్యల సంగతేంటి .. ప్రశ్నించిన రేవంత్ రెడ్డి
కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే, పట్టించుకోకుండా ఇప్పుడు మీరే అవినీతి జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళేశ్వరం అవినీతి పై ఫిర్యాదులు చేశారని, చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పదే పదే డిమాండ్ చేస్తే మీరు పెడచెవిన పెట్టారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు మీరే అవినీతి జరిగిందంటున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మాటలు సరే.. చర్యల సంగతి చెప్పండి సార్! అంటూ రేవంత్ రెడ్డి గజేంద్ర సింగ్ షెకావత్ ను సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం పై కేంద్రం మాటలు తప్ప, చేతలు లేవని, చర్యలు తీసుకునే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా టార్గెట్ చేశారు.