మిరపకాయలు.. ఉల్లిగడ్డల్లోను: 'డ్రగ్స్' భూతం వెనుక విస్తుపోయే విషయాలు..
చూడటానికవి మిరకపకాయలు.. ఉల్లిగడ్డలే. కానీ వాటిల్లో కొన్ని నకిలీ మిరప, నకిలీ ఉల్లిగడ్డలు కూడా ఉంటాయి. వాటిల్లో డ్రగ్స్ నింపి చేరాల్సి చోటుకు చేరుస్తుంటారు.
హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండా పనికానిచ్చేయాలి.. ఎవరికీ ఎక్కడా ఏమాత్రం అనుమానం రావద్దు. పక్కాగా ప్లాన్ అమలైతే.. కోట్లు కురిపించే దందాకు ఎలాంటి ఢోకా లేదు. నిఘా సంస్థలకు కూడా ఏమాత్రం అంతుపట్టని రీతిలో దందా కొనసాగాలి. ఇదీ హైదరబాద్ డ్రగ్ మాఫియా అనుసరించిన తీరు.
డ్రగ్ ఊబిలో చిక్కుకుపోయిన టీనేజర్లు చెప్పిన కఠిన వాస్తవాలు దీని తీవ్రతను పట్టించాయి. నిఘా సంస్థల కన్నుగప్పి డ్రగ్స్ సరఫరా అవుతున్న తీరుపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. ఆఖరికి కూరగాయల్ని కూడా డ్రగ్స్ సరఫరా చేయడానికి వాడుకుంటుండటం విస్తుగొలిపే విషయం.

మిరపకాయలు.. ఉల్లిగడ్డల్లోను?:
చూడటానికవి మిరకపకాయలు.. ఉల్లిగడ్డలే. కానీ వాటిల్లో కొన్ని నకిలీ మిరప, నకిలీ ఉల్లిగడ్డలు కూడా ఉంటాయి. వాటిల్లో డ్రగ్స్ నింపి చేరాల్సి చోటుకు చేరుస్తుంటారు. పైకి కూరగాయాల్లాగే కనిపిస్తుండటంతో.. ఎవరికీ ఎలాంటి అనుమానం కలగదు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి అవుతున్న డ్రగ్స్ ను ఇలా రకరకాల మార్గాల్లో మాఫియా ముఠాలు సరఫరా చేస్తున్నాయి.

స్టిక్కర్స్.. ఇతర మార్గాలు:
హైదరాబాద్‌లో పట్టుబడ్డ కెల్విన్ డ్రగ్స్ మాఫియా.. స్టిక్కర్స్ రూపంలో డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్నట్లు తేలగా.. మరికొన్ని మాఫియా ముఠాలు ఉల్లిగడ్డలు, మిరపకాయల రూపంలో తరలిస్తున్నట్లు తేల్చారు. మిరపకాయల మధ్యలో వీటిని తరలించడం వల్ల.. ఆ ఘాటుకు పోలీసు జాగిలాలు కూడా వాటిని గుర్తించడం లేదు. ఇక ఉల్లిపాయలను సైతం సగానికి కోసం.. సగ భాగం ఖాళీ చేసి.. అందులో డ్రగ్స్ నింపుతున్నట్లుగా గుర్తించారు. భారీ ఉల్లి లోడ్ లో వీటిని తరలిస్తున్నందువల్ల.. నిజమైన ఉల్లిపాయలే అని తనిఖీ అధికారులు పొరపడుతున్నారు.

శరీరంలో దాచిపెట్టి మరీ?:
శంషాబాద్ విమానశ్రయంలో పట్టుబడుతున్న గోల్డ్, డ్రగ్స్ లలో.. చాలావరకు శరీర లోపలి భాగాల్లో దాచుకుని వస్తున్నవే. మర్మాంగాల్లో సైతం వీటిని తరలిస్తుండటం అధికారులనే విస్తుపోయేలా చేసింది. ఇటీవల న్యూయార్క్ విమానాశ్రయంలో పట్టుబడ్డ ఓ ముఠా.. తొడ నుంచి పాదాల వరకు కొకైన్ డ్రగ్స్ ను కనిపించకుండా దాచేసి తరలించడానికి యత్నించినట్లు గుర్తించారు. పావురాలతోను డ్రగ్స్ తరలిస్తున్న ఘటనలు ఇటీవల ఇరాన్, కువైట్ లలో బయటపడ్డాయి.

ఇంటికి దూరంగా ఉంటున్నవాళ్లే?:
చదువుల కోసం నగరానికి వచ్చేవారు.. ఇంటికి దూరంగా ఉండే యువకులే ఎక్కువగా డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత గంజాయి, ఆపై కొకైన్ వంటి మత్తు పదార్థాలకు వీరు అలవాటుపడుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల మారేడ్ పల్లిలో డ్రగ్స్ తో పట్టుబడిన అనిరుధ్ నుంచి ఎక్సైజ్ అధికారులు పలు వివరాలు రాబట్టారు.
ఇతని వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసిన 60మందిని పోలీసులు ప్రశ్నించగా.. వీరిలో ఎక్కువమంది ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులేనని తేలింది. డ్రగ్స్ కేసుల్లో ఎక్కువగా నైజీరియన్లే పట్టుబడుతుండటంతో వారి వీసాలు, నివాసాలపై నిఘా పెంచారు. ఇక్కడి కళాశాలలు, పబ్ లలో చేరుతున్న విదేశీ విద్యార్థుల సమాచారాన్ని సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications