చిత్తుగా తాగేసి: ముగ్గురు బీటెక్ విద్యార్ధులు మృతి (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే మసీదుకు ఎదురుగా ఉన్న దుకాణం గోడను ఢీకొట్టింది.
ఈ సంఘటనలో ముగ్గురు విద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఉప్పల్‌కు చెందిన శరశ్చంద్ర, తేజ, నరేన్‌గా గుర్తించారు. ఈ ఘటనలో కార్తీక్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని కేర్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన కారు నెంబరు టీఎస్ 08 ఈసీ 1702 గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్ధులు మద్యం సేవించి కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

బాలానగర్‌లో రోడ్డు ప్రమాదంలో యవకుడి దుర్మరణం
ఆకస్మాత్తుగా మలుపు తిరిగిన కారును ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమగోదావరి కొవ్వూరు గౌరీపట్నానికి చెందిన కోడూరి అర్జున్ ఉషా ముళ్లపూడి ఆసుపత్రిలో అడ్మిస్ట్రేటర్‌గా పనిచేస్తూ గాజులరామారంలో నివాసముంటున్నాడు.
ఆయన కుమారుడు వెంకట శ్రీకర్ (18) ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చేయాలని ఆలోచిస్తున్నాడు. శనివారం రాత్రి జూబ్లిహిల్స్‌లోని తన స్నేహితుడు ప్రశాంత్ వద్దకు వెళ్లాడు. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో స్పోర్ట్స్ బైకుపై ఇంటికొస్తుండగా ఐడీపీఎల్ కానీ బస్టాప్ ఎదురుగా ఉన్న నల్లపోచమ్మ ఆలయం వద్ద ఆకస్మాత్తుగా ఓ కారు మలుపు తిరిగింది.

దీంతో వెంకట శ్రీకర్ వాహనం అదుపుతప్పి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతడు వాహనంపై నుంచి ఎగిరి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కొడుకు స్నేహితుడు అఖిల్ ద్వారా విషయం తెలుసుకున్న అర్జున్ కుమారుడిని ఘటన స్థలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆదర్శనగర్‌కు చెందిన ఒకే కుటుంబ సభ్యులైన ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications