కోటిన్నర దోచేసిన బ్యాంకు ఉద్యోగులు: 7గురి అరెస్ట్
హైదరాబాద్: విలాసాలకు అలవాటుపడి వచ్చిన జీతంతో సరిపెట్టుకోకుండా దొంగలుగా మారారు కొందరు బ్యాంకు ఉద్యోగులు. ఎక్కడో ఎందుకని సొంత బ్యాంకుకే కన్నం వేశారు. సుమారు రూ. కోటిన్నర దోచేసిన ఆ ఏడుగురు బ్యాంకు దొంగలను చాకచక్యంగా పట్టుకుని కటకటకాలకు పంపించారు పోలీసులు.
వివరాల్లోకి వెళితే.. నాచారంలోని ఓ ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగులు ఏటిఎంలలో డబ్బులను డిపాజిట్ చేసే సిఎంఎస్ సెక్యురిటీ సిబ్బందితో కలిసి దోపిడీకి కుట్ర పన్నారు. బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో ప్రతిరోజు సెక్యూరిటీ సంస్థ రూ.25 లక్షలు డిపాజిట్ చేస్తోంది. ఏటీఎంలలో డిపాజిట్ చేసిన తర్వాత ఆ బృందంలోని ఓ వ్యక్తి తమ సభ్యులకు సమాచారమిస్తాడు.

వాళ్లు వెంటనే అక్కడికి చేరుకొని మారు తాళాలతో ఏటీఎంను తెరిచి అందులో నుంచి రూ.2 లక్షలు తీసి తిరిగి యధావిధిగా తాళం వేస్తారు. ఇలా 20 ఏటీఎంలలో ఈ ముఠా నగదును చోరీ చేసిందని పోలీసులు గుర్తించారు.
ఇటీవల బ్యాంకు వార్షిక లెక్కల సమయంలో రూ.1.5కోట్లు తేడా వచ్చింది. దీంతో బ్యాంకు అధికారులు నాచారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిసింది. ఇందులో నలుగురు బ్యాంకు ఉద్యోగులు కాగా, ముగ్గురు సీఎంఎస్ సెక్యురిటీ సంస్థ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
ఏటీఎంల నంబర్ కోడ్లను తెలుసుకొని వాటికి నకిలీ తాళాలను తయారు చేసి చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి ఆనవాళ్లు బయటపడకుండా ఏటీఎంలలో సీసీ కెమెరాల కనెక్షన్లను తొలగించారని తెలుస్తోంది. నిందితుల నుంచి సొత్తును స్వాధీనం చేసుకొన్న తర్వాత వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications