ప్రతి నియోజకవర్గానికి రూ. 10 కోట్లు: అవినీతి సహించేది లేదంటూ సీఎం రేవంత్ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు. ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్ మంత్రులకు ఈ నిధుల బాధ్యత అప్పగిస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో జరిగిన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారికి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలన్నారు. ఈ క్రమంలో ఇంఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని, సమస్యలను పరిష్కరించుకోవాలని రేవంత్ సూచించారు.
నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఇంఛార్జీలు, ఎమ్మెల్యేలకు తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరుస్తామన్నారు నియోజకవర్గాల్లో నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని వారికి సూచించారు. ప్రతి శాఖలో అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దని ఈ ఐదు జిల్లాల ఇంఛార్జీలకు, ఎమ్మెల్యేలకు, పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు.

సీఎం రేవంత్‌తో గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం భేటీ
గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంగళవారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో భేటీ అయింది. గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్, ఇతర కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, కన్స్యూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులకు సూచించారు.
గోద్రెజ్ ఆగ్రోవెట్ తెలంగాణలో ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది. వంట నూనెలు, డెయిరీ, ఆగ్రో, వెటర్నరీ సర్వీసెస్, ఆగ్రో కెమికల్స్, పశువుల దాణా, వెటర్నరీ సర్వీసెస్ రంగాల్లో వ్యాపారం కొనసాగిస్తోంది. మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డెయిరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్
వికారాబాద్ - కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చించారు.
గతంలో ప్రతిపాదించిన వికారాబాద్ - కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. సమీప ప్రాంతాల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందన్నారు. రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో R&B, రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌ని కలిసిన అక్షయ పాత్ర ఫౌండేషన్ బృందం
హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని అక్షయ పాత్ర ఫౌండేషన్ బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. అక్షయ పాత్ర ఫౌండేషన్(Akshaya Patra Foundation) రీజినల్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభు జీ ముఖ్యమంత్రికి లక్ష్మీ నరసింహా స్వామి వారి చిత్ర పటాన్ని, భగవద్గీతను అందజేశారు. దేశంలో ఎలాంటి లాభాన్ని ఆశించకుండా పని చేస్తున్న సంస్థల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఒకటి. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో వారు చేస్తున్న కార్యక్రమాలను సీఎంకు వివరించారు.
భారతదేశంలోని ఆకలి, పోషకాహార లోపం తదితర సమస్యలను పరిష్కరించడానికి అక్షయ పాత్ర ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఓ చిన్నారి చదువుకు దూరం కాకుడదనే దృక్పథంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఎయిడెడ్ పాఠశాలలోని విద్యార్థులు ఆకలితో లేకుండా ఉండేలా, అదే సమయంలో పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడానికి కృషి చేస్తోంది. కాగా, దేశంలో 15 రాష్ట్రాలు,2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 20 లక్షల మంది పిల్లలకు ఆహారాన్ని అందిస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద మధ్యాహ్నా భోజన కార్యక్రమంగా ఎదిగింది.












Click it and Unblock the Notifications