ఆ స్కూల్స్ కోసం.. రూ. 11 వేల కోట్లు మంజూరు చేసిన రేవంత్ సర్కారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల విషయంలో కీలక ముందడుగు వేసింది. ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ. 11 వేల కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలల నిర్మాణానికి నిధులు విడుదల చేసింది.
ఒక్కో గురుకుల పాఠశాలకు రూ. 200 కోట్లు చొప్పున పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇలాంటి స్కూల్స్ దేశంలో ఎక్కడా లేవన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాఫ్స్‌కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని డిప్యటీ సీఎం తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు.

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేశామన్నారు. ప్రైవేట్‌లో చదివించలేని పిల్లలకు కార్పొరేట్ స్థాయి వసతులతో విద్య అందిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర విద్యారంగంలో ఈ స్కూల్స్ విప్లవాత్మక నిర్ణయమని చెప్పారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆ నాటి ప్రభుత్వం కోళ్లు, పశువుల రేకుల షెడ్లలో పాఠశాలలు ఏర్పాటు చేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం రూ. 7.19 లక్షల కోట్లను అప్పు చేసిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఒక పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలని అన్నారు. ఆ దిశగా పనిచేస్తున్నామన్నారు. మంచి కార్యక్రమాలు చేస్తుంటే.. ఓర్వలేకనే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications