మొంథా తుఫానుతో వరద ముంపు బాధితులకు సీఎం రేవంత్ బిగ్ రిలీఫ్.. కీలక ప్రకటన!
తెలంగాణ రాష్ట్రంలో మొంథా తుఫాను కారణంగా చోటు చేసుకునే వరదలలో ప్రాణం కోల్పోతే ఆ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ వెల్లడించారు. ఇక పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయలు చొప్పున పరిహారం అందిస్తామన్నారు. మొంథా తుఫాను ప్రభావంతో వరంగల్, హన్మకొండ జిల్లాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు పర్యటించారు.
వరంగల్ వరద బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
హన్మకొండ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుండి నీట మునిగిన పంట పొలాలను వీక్షించారు. అనంతరం హన్మకొండలోని సమ్మయ్య నగర్, పోతన నగర్ లను సందర్శించి వరద బాధితులను పరామర్శించారు. వరద కారణంగా దెబ్బ తిన్న నాలాలను, వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. పలువురు రైతులను కలిసి సమస్యలను తెలుసుకున్నారు.

అధికారులతో సమీక్ష.. కీలక ఆదేశాలు
అనంతరం హన్మకొండ కలెక్టరేట్ కు చేరుకొని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో బృందాలను పంపి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం ప్రభుత్వ ఆస్తుల నష్టం వివరాలకు సంబంధించి సమగ్ర నివేదికలు కలెక్టర్లు తెప్పించుకోవాలని సూచించారు.
అధికారులకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్
ఈ నష్టం తాలూకు వివరాలను కేంద్రానికి పంపిన సహాయం అడుగుతామని, విధుల నిర్వహణలో, కేంద్రం నుండి నిధులను తెచ్చుకునే క్రమంలో ఏ ఒక్కరు అలసత్వం వహించడానికి వీలులేదన్నారు. అలా అలసత్వం వహించిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానం మారిందన్నారు. వరదల వల్ల ఎక్కడైనా ప్రాణనష్టం జరిగితే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు.
పంట నష్టంపై ఎకరానికి 10వేలు
పంట నష్టంపై ఎకరానికి 10వేల రూపాయలు ఇస్తామని తెలిపారు. ఆవులు, గేదలు మృతి చెందితే 50వేల రూపాయలు, గొర్రెలు, మేకలు మృతి చెందితే 5000 రూపాయల పరిహారం అందిస్తామన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు ఇచ్చే చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇటువంటి ఘటన చోటు చేసుకోకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రతిపాదనలు చేయాలన్నారు. ఇసుక మేటలు వేసిన పొలాలలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేయాలన్నారు.
ఇల్లు డ్యామేజ్ అయితే 15 వేలు
ఇండ్లు డ్యామేజ్ అయిన వాళ్ళకు 15వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. మున్సిపల్, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే ముంపు తీవ్రత పెరిగిందని, అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. చెరువుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో పై లెక్కలు పక్కాగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నాలాల కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి
నాలాల కబ్జా పైన ఉక్కుపాదం మోపాలని, ఎవరున్నా ఆక్రమణల పైన వెనక్కు తగ్గేది లేదన్నారు. ఒక్కరి కారణంగా వందల మంది జీవితం ఆగం కావద్దని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ పైన ప్రత్యేక ప్రణాళిక ఉండాలని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తో అధికారులు ముందుకు రావాలని అన్నారు.












Click it and Unblock the Notifications