కేసీఆర్ గారు.. వచ్చే బడ్జెట్‌లో రైతు నిధి సరే!: ఈ సీజన్‌ మాటేమిటి?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: రైతులు తాము పండించిన వివిధ పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని గగ్గోలు పెడ్తున్నారు. రకరకాల నిరశన వ్యక్తంచేస్తున్నారు. కొందరు నడిరోడ్డుపై పంట తగులబెడితే మరికొందరు రైతులకు దాణాగా వదిలేస్తున్నారు. ఇంకొందరు వ్యాపారులు, అధికారుల కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ ఆందోళన బాట పడ్తున్నారు.

గత ఏడాది క్వింటాల్ మిర్చికి రూ.12,000 నుంచి రూ.14 వేల వరకు పలికితే ఈ ఏడాది హఠాత్తుగా రూ.4,500 నుంచి రూ.2,500లకు పడిపోవడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. నాణ్యత సాకుతో వ్యాపారులు దారుణంగా రేటు తగ్గించడంతో మార్కెట్ యార్డును చుట్టుముట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వం ద్రుష్టిలో రాజకీయంగా ప్రతిపక్షాలు చేసిన కుట్రగా కనిపిస్తున్నది.

రైతులు బాగుపడటం విపక్షాలకు ఇష్టం లేదని ఎదురుదాడికి దిగిన సర్కార్‌కు మిర్చి రైతుల ఆందోళనలో వాస్తవికత ఉన్నదని సర్కార్‌కు గోచరించినట్లు కనిపిస్తున్నది. మిర్చి రైతుల ఆందోళన అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే వ్యవహరిస్తున్నదా? అన్నట్లు ప్రభుత్వం అనుసరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

Rs.500 Crores fund for farmers, Says Telangana CM KCR

కాకపోతే పామాయిల్ ఉత్పాదక ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించేందుకు వచ్చిన ఖమ్మం, భద్రాద్రి - కొత్తగూడెం జిల్లాల రైతులతో సమావేశమైన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. పంటలకు గిట్టుబాట ధర సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ.500 కోట్ల ప్రత్యేక నిధి కేటాయిస్తామని ప్రకటించారు. అదీ వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమాఖ్యలే ఆయా పంటల ధరలు నిర్ణయిస్తాయని మరో హామీ ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నది.

వచ్చే ఏడాది సరే.. ఈ సీజన్‌లో అదుకునేదెవరు?

ఎక్కువ ధర పలికితే కుటుంబ కష్టాలు తీరుతాయని కోటి ఆశలతో ఈ ఏడాది పండించిన మిర్చికి గిట్టుబాటు ధర కల్పించడంలో వైఫల్యానికి కారణమేమిటి? తక్షణ సమస్య పరిష్కారం చేయడానికి బదులు వచ్చే ఏడాదికి మార్గం వేస్తామని ఏలినవారు చెప్పడం 'నేల విడిచి సాము చేయడమే' అవుతుందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. మిర్చి రైతుల ఆందోళన పూర్తిగా రాజకీయ మయమని పైకి గంభీర వ్యాఖ్యలు చేస్తున్న అధికార పక్షానికి 'మిర్చి' ఆందోళన ఘాటు బాగానే తాకినట్లు కనిపిస్తున్నది. మిర్చి రైతులను ఆదుకోవడం ఎలా? అని రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.

శాంతిభద్రతల సమస్యగా రైతుల ఆందోళన

నెల రోజులుగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడిపోతున్నారు. అసహనంతో అనేక చోట్ల మిర్చిని తగులబెడుతున్నారు. తాజాగా ఖమ్మం మార్కెట్‌ యార్డు ధ్వంసంతో సర్కార్ ఉలిక్కిపడింది. పరిస్థితి చేయిదాటి పోతోందన్న భయాందోళనలో పడింది. పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమైన అధికారుల తీరు పట్ల సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నారని తెలిసింది. అక్కడ అంత జరుగుతున్నా శాంతిభద్రతల సమస్యగానే అధికారులు చెప్పడం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపారులను ఒప్పించి రైతులకు తగిన ధర ఇప్పించేలా అధికారులు ఎందుకు చొరవ చూపలేదన్న చర్చ నడుస్తోంది. కొందరు అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారమూ జరుగుతోంది.

కేంద్రంపై ఆశలు వదులుకున్న రాష్ట్ర ప్రభుత్వం

రైతులు 2016-17 ఖరీఫ్‌లో 2.61 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌ జిల్లాల్లోనే అధిక సాగు జరిగింది. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 3.17 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. ధర మాత్రం అమాంతం పడిపోయింది. 2015-16 ఖరీఫ్‌లో పండిన మిర్చి ధర మార్కెట్లో క్వింటాలుకు రూ.12 వేల వరకు పలకగా, ఈ ఏడాది ఏకంగా రూ.4,500 వరకు పడిపోయింది. ఈ నేపథ్యంలో మిర్చిని క్వింటాలుకు రూ.7000, రూ.8000 కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు. ఇప్పటికే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 20 నుంచి రైతులకు మార్కెట్ యార్డుల్లో జరుగుతున్న కొనుగోళ్లపై క్వింటాల్‌కు రూ.1,500 అందజేస్తున్నది.

రూ.1500 బోనస్ చెల్లింపునకు సర్కార్ సుముఖం?

ఇప్పటికే క్వింటాల్ మిర్చికి రూ.2000 బోనస్ ఇవ్వాలని అసెంబ్లీలో విపక్ష నేత కుందూరు జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు మిర్చి రైతులను ఆదుకునేందుకు బోనస్‌గా క్వింటాలుకు రూ.1,500 ఇచ్చేలా సహకరించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. లేఖ రాసినా, స్వయంగా అధికారులు వెళ్లి విన్నవించినా కేంద్రం మిన్నకుండిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆశలు వదులుకున్నది. ఇలాగే కొనసాగితే రైతుల్లో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందని, వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా? సెంటిమెంట్ ప్లస్ తనకు గల సానుకూల పరిస్థితులను అడ్డం పెట్టుకుని ఆత్మరక్షణ ధోరణితో వ్యవహరిస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే మరి.

రైతు వద్ద రూ.45.. రిటైల్ మార్కెట్‌లో రూ.110

గమ్మత్తేమిటంటే రిటైల్ మార్కెట్‌లో మిర్చి కిలోకు రూ. 110 పలుకుతోంది. కానీ అదే వ్యాపారులు మాత్రం రైతుల దగ్గర రూ.45లకే కొనుగోలు చేస్తుంటే.. హైదరాబాద్‌లో వినియోగదారుడు ఎండు మిర్చికి రూ.90 నుంచి రూ.110 చెల్లించాల్సి వస్తున్నది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. వినియోగదారులకు విక్రయించే ధర రెండు రెట్లకుపైగా పెంచేస్తున్నా ఇదేమిటని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కానీ పంట చేతికి రావాలంటే నారు పోసిన నుంచి ఆర్నెల్లు, ఒక్కోరకం 8 నెలల సమయం పడుతుంది. క్వింటా మిర్చి పంటకు కనీసం రూ.7000 ఖర్చవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గతేడాది రూ.12 వేల వరకూ క్వింటాల్ ధర పలికింది. ఈఏడాది మాత్రం మార్కెట్లో రూ.4500కు మించి కొనడంలేదు. రాష్ట్రప్రభుత్వం రూ.1500 వరకూ బోనస్‌ ఇవ్వాలని నిర్ణయించనుందని తెలుస్తోంది. ఇది కార్యరూపం దాల్చేసరికి రైతుల దగ్గర పంట మొత్తం దళారుల చేతుల్లోకి వెళ్లిపోతుందని రైతుసంఘం నేతలు పేర్కొంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangan CM K Chandra Shekhar Rao said that his govermnent will allocate farmer's fund with Rs.500 crores while this will decide mimimum support price for different crops.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి