TGSRTC: ఆర్టీసీ బస్టాండ్ లో మహిళకు పురిటినొప్పులు.. ప్రసవం చేసిన సిబ్బంది..
బస్టాండ్ లో గర్భిణీ ప్రసవించిన ఘటన కరీంనగర్ లో జరిగింది. ఆర్టీసీ సిబ్బంది సహాయంతో మహిళకు ప్రసవం చేశారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ, 108 సిబ్బంది ఆ మహిళకు పురుడుపోసి మానవత్వం చాటుకున్నారు. ఒడిశాకు చెందిన కుమారి-దూల దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఇటుక బట్టీలో కొద్దిరోజులుగా కూలీలుగా పనిచేస్తున్నారు. కుమారి ప్రస్తుతం 9 నెలల గర్భిణీగా ఉన్నారు. ఆదివారం సాయంత్రం వారు కుంట-భద్రాచంల మీదుగా స్వస్థలానికి వెళ్లేందుకు పెద్దపల్లి నుంచి కరీంనగర్ బస్టాండ్ కు చేరుకున్నారు.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో కుమారికి నొప్పులు వచ్చాయి. దీంతో భర్త దూల ఆమెను చెట్టు కింద పడుకోబెట్టి.. ఆర్టీసీ సిబ్బంది వద్దకు సహాయం కోసం వెళ్లారు. ఎస్ఎం నోముల అంజయ్య గౌడ్ వద్దకు వచ్చి తన భార్యకు నొప్పులు వస్తున్నాయని చెప్పాడు. దీంతో అంజయ్య గౌడ్ వెంటనే సిబ్బందిని కుమారి వద్దకు పంపించారు. ఆ వెంటనే 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇంతలో మహిళకు నొప్పులు పెరగడంతో స్వీపర్లు, సూపర్ వైజర్, ఆర్టీసీ సిబ్బంది చీర అడ్డుపెట్టి ప్రసవం చేశారు. పండంటి ఆడ బిడ్డకు కుమారి జన్మనిచ్చింది. 108 సిబ్బంది అక్కడికి చేరుకుని తల్లీ, బిడ్డను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కుమారికి పురుడుపోసిన ఆర్టీసీ స్వీపర్లు సైదమ్మ, స్రవంతి, లావణ్య, భవానీ, రేణుకను అధికారులు, ప్రయాణికులు అభినందించారు. కాగా తన భార్యకు డెలివరీ సమయం వచ్చే వరకు ఇటుక బట్టీ యాజమాని కూలీ డబ్బులు ఇవ్వలేదని, రేపుమాపు అంటూ దాటవేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కుమారి భర్త దూల తెలిపారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీసీ సిబ్బందిని డిపో మేనేజర్ రజనీ కృష్ణ అభినందించారు.












Click it and Unblock the Notifications