ఆర్టీసీ సమ్మె సైరన్: మరో 'సకల జనుల సమ్మె'కు సై!
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మెకు రాష్ట్రవ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తోంది. తాము తలపెట్టిన సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాలే కాకుండా అనేక ప్రజా సంఘాలు కూడా ఈ పోరాటానికి అండగా నిలిచాయని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న వెల్లడించారు. ఏప్రిల్ 22 నుంచి సమ్మెకు పిలుపునిస్తూ.. ప్రస్తుత పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నప్పటికీ, ప్రభుత్వం కనీసం చర్చలకు ఆహ్వానించకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన విమర్శించారు. ఈ నిర్లక్ష్య వైఖరి వల్లే తాము ఏప్రిల్ 22 నుంచి సమ్మెకు వెళ్లక తప్పడం లేదని స్పష్టం చేశారు.
ఆర్టీసీ విలీనం కాగితాలకే పరిమితం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కేవలం కాగితాలకే పరిమితమైందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. విలీనం కోసం వేసిన కమిటీ కేవలం కాలయాపన చేసేందుకేనని.. ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదని వారు వాదిస్తున్నారు. ఇదే సమయంలో నష్టాల్లో ఉన్న హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వ పరం చేసేందుకు ఆసక్తి చూపుతున్న పాలకులు, లక్షలాది మంది సామాన్యులకు రవాణా సౌకర్యం కల్పించే ఆర్టీసీని మాత్రం ఎందుకు విస్మరిస్తున్నారని వారు సూటిగా ప్రశ్నించారు.

ఆర్థిక వనరుల వినియోగంపై అసహనం
ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతున్న ప్రభుత్వం.. మూసీ నది అభివృద్ధి వంటి అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని జేఏసీ నేతలు నిలదీశారు. ప్రాధాన్యత క్రమంలో ప్రజా రవాణా వ్యవస్థను కాపాడటం కంటే, ఇతర నిర్మాణ పనులకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని వారు విమర్శించారు. నిధుల కొరత అనేది కేవలం ఆర్టీసీ డిమాండ్లను తొక్కేయడానికి చెబుతున్న సాకు మాత్రమేనని వారు అభిప్రాయపడ్డారు.
ప్రైవేటీకరణ ముప్పు
ఆర్టీసీని క్రమంగా ప్రైవేటీకరించే దిశగా అడుగులు పడుతున్నాయని జేఏసీ తీవ్రంగా హెచ్చరించింది. ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, ఆర్టీసీ విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ఆలోచనలు సంస్థ మనుగడకే ప్రమాదకరమని వారు పేర్కొన్నారు. ఈ సమ్మెలో ఔట్ సోర్సింగ్ కార్మికులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ, ప్రభుత్వం దిగి రాకపోతే ఇది తెలంగాణ ఉద్యమ కాలం నాటి "సకల జనుల సమ్మె"ను తలపిస్తుందని వెంకన్న హెచ్చరించారు.












Click it and Unblock the Notifications