యూపీలో మారుతున్న సమీకరణం: జయప్రద డైలమాకు పుల్‌స్టాప్!
లక్నో/హైదరాబాద్: అమర్ సింగ్ తిరిగి సమాజ్‌వాది పార్టీలో చేరనున్నారు. ఆయనను ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రాజ్యసభకు పంపించేందుకు నిర్ణయించారు. అమర్ సింగ్ సమాజ్ వాది పార్టీలో చేరనున్న నేపథ్యంలో... జయప్రదకు కూడా లైన్ క్లియర్ అవుతుందని అంటున్నారు.
గత ఆరేడేళ్లుగా జయప్రద రాజకీయాల విషయమై తీవ్ర డైలమాలో ఉన్నారు. రాజకీయంగా అమర్ సింగ్ ఎక్కడ ఉంటే జయప్రద అక్కడ ఉంటారు. ఆరేళ్ల క్రితం ఎస్పీ నుంచి అమర్ సింగ్‌తో పాటు జయప్రద బయటకు వచ్చారు. అమర్ సింగ్ స్థాపించిన పార్టీలో జయప్రద ఉన్నారు.
ఆ పార్టీ విజయవంతం కాలేదు. దీంతో అమర్ సింగ్, జయప్రద రాజకీయ జీవితం డైలమాలో పడింది. 2014 ఎన్నికల్లో జయప్రద తెలుగు రాష్ట్రాలకు వస్తారనే ప్రచారం జరిగింది. టిడిపిలో చేరుతారని ఓసారి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మరోసారి ప్రచారం జరిగింది. కానీ ఆమె తెలుగు రాష్ట్రాలకు రాలేదు.

అ తర్వాత ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడంతో ఆ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అంతకుముందు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ వైపు కూడా చూశారు.
యూపీ రాజకీయాల్లో తనకు గురువు అయిన అమర్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీకి గుడ్ బై చెప్పడంతో నాడు జయప్రద కూడా రాజకీయాలకు దూరమయ్యారు. ములాయం సింగ్ యాదవ్‌తో చాన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ మిలాఖత్ అయిపోయారు అమర్ సింగ్.
రాజ్యసభకు వెళ్లేందుకు అమర్ సింగ్‌కు లైన్ క్లియర్ అయింది. తిరిగి సమాజ్ వాదీ పార్టీలో అమర్‌సింగ్ కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవడంతో, ఆయనతోపాటే ఆ పార్టీలోకి వెళ్ళేందుకు జయప్రద కూడా సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఎట్టకేలకు ఇన్నాళ్లు డైలమాలో ఉన్న జయప్రద మళ్లీ పాత పార్టీ వైపు వెళ్లనుందంటున్నారు.
కాగా, త్వరలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో యూపీ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలో కొనసాగుతున్న అమర్ సింగ్ మరోసారి సమాజ్‌వాదీ పార్టీ గూటికి చేరారు. అమర్ సింగ్‌ను రాజ్యసభకు పంపుతామని ఎస్పీ పచ్చజెండా ఊపింది.
మంగళవారం ఎస్సీ అధినేత ములాయం సింగ్ అధ్యక్షతన జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో రాజ్యసభకు ఏవరేవరిని పంపాలన్న అంశంపై చర్చించారు. అనంతరం ఏడుగురిని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వారిలో.. అమర్ సింగ్, బేణి ప్రసాద్ వర్మ, సంజయ్ సేత్, సుక్రంయాదవ్, విశంబర్ ప్రసాద్ నైషద్, అరవింద్ సింగ్, రేవితి రమణ్ సింగ్ ఉన్నారు. యూపీలో 11 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జూన్ 11న ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications