సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి: ఉదయనిధి: చిల్కూర్ ఆలయ ప్రధాన అర్చకుడి ఫైర్
హైదరాబాద్: తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీనిపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. భారతీయ జనతా పార్టీ.. దీన్ని జాతీయ అంశంగా మలిచింది. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియాకు కట్టే ప్రయత్నం చేస్తోంది.
సనాతన ధర్మం అనేది బడుగు, బలహీన వర్గాలు, దళితులను అణగదొక్కుతోందని, బ్రాహ్మణిజాన్ని పెంచి పోషిస్తోందని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం పేరుతో దళితులకు ఆలయ ప్రవేశాన్ని కల్పించడాన్ని కొందరు అడ్డుకుంటోన్నారని మండిపడ్డారు. అలాంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకుని కులం, మతం పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే మానవత్వాన్ని నిలబెట్టడమేనని వివరించారు. సనాతన ధర్మం కారణంగా అణగారిన, అట్టడుగున ఉన్న వారి తరపున తాను మాట్లాడానని స్పష్టం చేశారు.
సనాతన ధర్మం, సమాజంపై దాని ప్రతికూల ప్రభావం గురించి లోతైన పరిశోధన చేసిన పెరియార్, అంబేద్కర్ విస్తృతమైన రచనలపై ఏ వేదికపైనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని, న్యాయస్థానం లేదా ప్రజాకోర్టులో సవాళ్లను ఎదుర్కొనడానికీ తాను సంసిద్ధంగా ఉన్నాననీ స్టాలిన్ తేల్చి చెప్పారు.
సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ స్పందించారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని, ఉదయనిధి వంటి వారిని చాలామందిని చూసిందని అన్నారు. అనేక దండయాత్రలు, ఆలయాలపై దాడులు, ధర్మ విధ్వంసాన్ని చూసిందని, కాలపరీక్షలో నిలిచిందని గుర్తు చేశారు.
సనాతన ధర్మాన్ని పాటించే వారిపై అనేక రకాల దౌర్జన్యాలు జరుగుతున్నప్పటికీ దేశంలో ఇప్పటికీ అది మనుగడ సాగిస్తూనే ఉందని రంగరాజన్ చెప్పారు. ద్రవిడ భావజాలం అంటే ఏమిటో ఉదయనిధి స్టాలిన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారాయన. తమిళ సంస్కృతి అభివృద్ధి, దాన్ని పరిరక్షించడానికి ఉదయనిధి ఏం చేశారని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని ఎన్నుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications