హైదరాబాద్-విజయవాడ హైవేలో ఇరుక్కుపోయారు!
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని లక్షలాది మంది ప్రజలు సొంతూళ్ల బాట పట్టారు. దీంతో రహదారులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. గత రెండు, మూడు రోజుల నుంచి జాతీయ రహదారులన్నీ రద్దీగా దర్శనమిస్తున్నాయి. ఇక, శనివారం జాతీయ రహదారి 65 పై 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో ధర్మాజీ గూడెం స్టేజ్ వద్ద గందరగోళం ఏర్పడింది. విజయవాడ వెళ్లే వాహనాలను రెండు ప్రధాన రహదారులపైకి పంపించడంతో.. 5 కిలోమీటర్ల మేర వేలాది వాహనాలు నిలిచిపోయాయి.

శనివారం తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ నిలిచిపోవడం గమనార్హం. ఆదివారం నుంచే పండుగ మొదలు అవుతుండటంతో గత రెండు రోజుల కంటే రెండింతల వాహనాలు శనివారం రహదారులపైకి వచ్చాయి. దీంతో జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు హైవేపై 50 వేల ప్రైవేట్ వాహనాలు వెళ్లడం గమనార్హం. వీటిలో 90 శాతం కార్లే ఉన్నాయి.
హైదరాబాద్-విజయవాడ హైవేపై లింగోజిగూడ నుంచి లక్కారం మధ్య సుమారు 3కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు..!! pic.twitter.com/aPfIfBbCVH
— oneindiatelugu (@oneindiatelugu) January 13, 2024
ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే పనిలో నిమగ్నమైనప్పటికీ వాహనాలు మాత్రం వేగంగా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణతోపాటు ఏపీ జిల్లాలకు వెళ్లేందుకు ఇదే మార్గం కావడంతో వేలాది వాహనాలు రహదారిపై నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో గంటలపాటు రహదారిపైనే వాహనాలు గడపాల్సి వచ్చింది. మరోవైపు, బస్లాండ్ లు, రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడిపోయాయి.












Click it and Unblock the Notifications