సౌదీ బస్సు ప్రమాద మృతుల్లో హైదరాబాదీలు.. సీఎం రేవంత్ దిగ్బ్రాంతి, కీలక ఆదేశాలు!
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మక్కా మసీదు నుండి మదీనా కు వెళుతున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 42 మంది సజీవ దహనమయ్యారు. అయితే మృతులలో ఎక్కువమంది హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం.
సౌదీలో ఘోర బస్సు ప్రమాదం .. 42మంది మృతి
సౌదీ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఒంటిగంట 30 నిమిషాల ప్రాంతంలో మక్కా యాత్ర ముగించుకొని మదీనాకు బయలుదేరిన యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగి క్షణాలలోనే బస్సు దగ్ధమైంది. ఆ బస్సులో ఉన్న 42 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులంతా మంచి నిద్రలో ఉండటంతో అలర్ట్ కాలేకపోయారు.

మెహిదీపట్నంలోని రెండు ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్ళిన హైదరాబాదీలు
మృతులలో 20 మంది మహిళలు 11మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బస్సులో మల్లేపల్లి, బజార్ ఘాట్ ప్రాంతాలకు చెందిన 16 మంది యాత్రికులు ఉన్నట్టు సమాచారం. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు ఉన్నట్టు సమాచారం.హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన యాత్రికులు మెహిదీపట్నంలోని రెండు ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. బస్సు ప్రమాదంలో వీరే ఎక్కువమంది మృతి చెందినట్టు తెలుస్తోంది.
సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి, కీలక ఆదేశం
సౌదీ అరేబియాలో యాత్రికులతో ఉన్న బస్సు ప్రమాదానికి గురి కావటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని. అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని సమాచారం అందిందని, పూర్తి వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, DGP లను సీఎం రేవంత్ రెడ్డి అదేశించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, సౌదీ రాయబార కార్యలయం అధికారులతో మాట్లాడాలని సూచించారు.
సచివాలయంలో కంట్రోల్ రూమ్
అవసరమైతే తగిన సహాయక చర్యలు చేపట్టాలనీ అదేశించారు. కాగా, సౌదీ లో జరిగిన బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు తగిన సమాచారాన్ని, సహాయ సహకారాలనూ అందించేందుకు హైదరాబాద్ లోని సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు 79979 59754 , 99129 19545 ఈ ఫోన్ నెంబర్లకు కాల్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
మృతుల వివరాల కోసం హజ్ కమిటీ ప్రతినిధులు ప్రయత్నాలు
ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతులలో తెలంగాణ వాసులు ఉండడంతో వారు ఏ ఏజెన్సీ ద్వారా ప్రయాణించారో తెలుసుకోవడానికి హజ్ కమిటీ ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి స్పష్టత మరికాసేపట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications