చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలు పొడిగింపు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు..
Special Trains: వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

తాజాగా మరిన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రకటించారు. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం- బెంగళూరు, విశాఖపట్నం- తిరుపతి, విశాఖపట్నం- చర్లపల్లి స్టేషన్ల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఆయా మార్గాల్లో ఈ నెల పొడవునా ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.
ఇప్పుడు తాజాగా చర్లపల్లి నుంచి తమిళనాడులోని రామనాథపురం మధ్య రాకపోకలు సాగించే మరో ప్రత్యేక రైలును పొడిగించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
చర్లపల్లి నుంచి ప్రతి రోజూ సాయంత్రం 4:45 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07695 ప్రత్యేక రైలు మరుసటి రోజు రాత్రి 11:55 నిమిషాలకు రామనాథపురానికి చేరుకుంటుంది. రామనాథపురం నుంచి ప్రతిరోజూ ఉదయం 9:10 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07696 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 5:45 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, చెన్నై ఎగ్మూర్, చెంగల్పట్టు, విల్లుపురం, తిరుప్పదిరిప్పులియూర్, చిదంబరం, సర్కాజీ, మైలాడుథురై, తిరువారూర్, తిరుతురైపూండీ, ఆదిరామపట్టణం, పట్టుక్కోట్టై, ఆరంతంగి, కారైకుడి, శివగంగ, మనమదురై మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
ముందుగా ప్రకటించిన విధంగా చర్లపల్లి నుంచి బయలుదేరే ఈ రైలు గడువు ఈ నెల 11వ తేదీన ముగియాల్సి ఉండగా.. 25వ తేదీ వరకు పొడిగించారు. రామనాథపురం నుంచి బయలుదేరే రైలు గడువు ఈ నెల 13వ తేదీన ముగియాల్సి ఉండగా.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో 27వ తేదీ వరకు పొడిగించారు.












Click it and Unblock the Notifications