మెరుపు వేగంతో దూసుకొస్తోన్న 'సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్'
నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం గత రెండు పర్యాయాలతోపాటు మూడో పర్యాయం కూడా రైల్వేల అభివృద్ధికే అధిక ప్రాధాన్యతనిస్తోంది. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ పథకం కింద ప్రధాన నగరాల్లోని రైల్వేస్టేషన్లను ఆధునికీకరిస్తున్నారు. వీటికి సంబంధించిన పనులు దేశవ్యాప్తంగా చురుగ్గా సాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలకమైన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను కూడా రూ.700 కోట్ల వ్యయంతో పునర్నిర్మిస్తున్నారు. ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ఈ పనులు చేపట్టారు.
200 కార్లకు పార్కింగ్
2025 ఏడాది చివరకు దీన్ని పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. దేశంలో అత్యంత రద్దీగా ఉండే టాప్-5 రైల్వేస్టేషన్లలో సికింద్రాబాద్ కూడా ఒకటి. ఇక్కడి నుంచి ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు ఎక్కువగా రాకపోకలు జరుగుతుంటాయి. 24 గంటలూ రద్దీ ఉండటంతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి. దీంతో రూ.450 కోట్ల వ్యయంతో ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్ గా చర్లపల్లిలో పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. సికింద్రాబాద్ లో తాత్కలిక టికెట్ల బుకింగ్ కార్యాలయాన్ని నిర్మించారు. అండర్ గ్రౌండ్-2లో 200 కార్లు నిలిచేలా పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

విమానాశ్రయం తరహాలో సౌకర్యాలు
అభివృద్ధి పనులన్నీ పూర్తయిన తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో మొత్తం 26 లిఫ్టులతోపాటు 32 ఎస్కలేటర్లు, రెండు ట్రావెలేటర్లు ఉంటాయి. మెట్రో రైలుకు వెళ్లేందుకు మల్టీమోడల్ కనెక్టివిటీని తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం బేస్ మెంట్1, బేస్ మెంట్ 2కు సంబంధించిన స్లాబ్ పనులు పూర్తయ్యాయి. ఆర్పీఎఫ్ భవనం, ప్లంబింగ్, స్ట్రక్చరల్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం సివిల్ పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయ తరహాలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఉన్న రైల్వే పనులను ముమ్మరంగా చేయిస్తోంది. పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ స్టేషన్ ను జాతికి అంకితం చేస్తారు. వచ్చే నెలలోనే చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దాదాపు 95 శాతం పనులు పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications