కేసీఆర్ ను కలిసిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. మేడారం జాతరకు ఆహ్వానం అందజేత
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రంగం సిద్ధమైంది. తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతరను ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. ఈ మహా జాతర 2026 జనవరి 28 నుండి జనవరి 31 వరకు 4 రోజులపాటు జరుగనుంది. మహా కుంభమేళా తర్వాత దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే జాతర ఇదే కావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు మేడారం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.230 కోట్లతో విస్తృత పనులు చేపట్టిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కు మంత్రులు మేడారం ఆహ్వాన పత్రికను అందజేశారు. మేడారం రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. అదే విధంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్వయంగా ఆహ్వానం అందజేసినట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ ను కలుసుకోలేకపోయామని అన్నారు. అందుకే కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించేందుకు ఇక్కడికి వచ్చామని తెలిపారు.
సమ్మక్క–సారలమ్మ జాతరకు కేసీఆర్కు ఆహ్వానం#KCR #Seethakka #KondaSurekha #SammakkaSaralamma #PoliticsToday #Telangana #OITelugu
— oneindiatelugu (@oneindiatelugu) January 8, 2026
మేడారం మహా జాతరకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పాటు ఆయన సతీమణి శోభమ్మ గారిని కూడా మేము ఆహ్వానించాము.
ఇది రాజకీయాలు మాట్లాడుకునే… pic.twitter.com/PBkAbD4qKF
"సాంప్రదాయ బద్ధంగా నిర్వహించుకునే జాతర మేడారం. ఆదివాసి బిడ్డలుగా పుట్టిన సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసి జాతర. ప్రాంతాలకు అతీతంగా అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క సారలమ్మలు. మేడారం మహా జాతరకి కేసీఆర్ ను ఆహ్వానించాం. కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మను మేడారం రావాల్సిందిగా ఆహ్వానించాము. తల్లుల బంగారాన్ని, బట్టలను కేసీఆర్ దంపతులకు బహుకరించి మేడారం రావలసిందిగా ఆహ్వానించాము. మా ఆహ్వానాన్ని కేసీఆర్ స్వీకరించారు" అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

'కేసీఆర్ నివాసానికి వచ్చిన మాకు చీరలు బహుకరించడం సంతోషంగా ఉంది. రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు. రాష్ట్ర పండుగగా ఎప్పటి నుంచో మనం జాతర నిర్వహించుకుంటున్నాము. ఆడబిడ్డలుగా మేము కేసీఆర్ గారిని ఆహ్వానించాము. మా ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మేడారం జాతరకు వస్తానని కేసీఆర్ చెప్పారు" అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications