మేయర్ విజయలక్ష్మికి షాక్.. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్గం ఆందోళనతో తెరపైకి కొత్తపంచాయితీ!!
బీఆర్ఎస్ పార్టీలో పార్టీ నేతలకు మధ్య ఉన్న అంతర్గత కలహాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఎక్కడ చూసినా పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మికి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కి మధ్య పొసగటం లేదు అన్నది తాజాగా జరిగిన ఒక సంఘటన తో బయటకు వచ్చింది.

ఉప్పల్ లో మేయర్ విజయలక్ష్మి కి చేదు అనుభవం
ఇంతకు ఏం జరిగిందంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ విజయలక్ష్మి ఉప్పల్ నియోజకవర్గం లోని చిలుకానగర్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు వచ్చారు. ఆమె శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి లేకుండా మేయర్ శంకుస్థాపనలు ఎలా చేస్తారంటూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఉప్పల్ లో మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు సొంతపార్టీ కార్యకర్తల నుండే నిరసన సెగ తగిలింది.

ఎమ్మెల్యే తో నాకేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్
ఇక తనతో పెద్దఎత్తున గొడవకు దిగిన టిఆర్ఎస్ కార్యకర్తలు, నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మేయర్ విజయలక్ష్మి, జిహెచ్ఎంసి నిధులతో చేసే కార్యక్రమాలకు ఎమ్మెల్యేను పిలవాల్సి న అవసరం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ప్రోటోకాల్ సంబంధం లేదని, ప్రోటోకాల్ పాటించకుండా అధికారుల పని అంటూ మేయర్ విజయలక్ష్మి తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే తో నాకేం పని ఇది నా కార్యక్రమం అంటూ అసహనం వ్యక్తం చేసిన మేయర్ విజయలక్ష్మి తీరుతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇక ఉద్రిక్త పరిస్థితుల మధ్య మేయర్ విజయలక్ష్మి శంకుస్థాపన చేయకుండానే వెళ్ళిపోయారు.

ఉప్పల్ నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెనుదిరిగిన మేయర్
ఇదిలా ఉంటే ఉప్పల్ నియోజకవర్గం లోని చిలుక నగర్ వార్డ్ నెంబర్ 7 లో సిసి రోడ్డుకు మేయర్ శంకుస్థాపన చేయాల్సి ఉంది. అలాగే మల్లికార్జున నగర్ లో 80 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నుంచి బీరప్పగడ్డ గణేష్ టెంపుల్ సాయి రామ్ నగర్ వరకు 55 లక్షలతో చేపట్టనున్న రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటానికి వచ్చిన మేయర్ విజయలక్ష్మి వాటిలో పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఇక దీనిపై ఆమె సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

బేతి సుభాష్ రెడ్డి వర్సెస్ మేయర్ విజయలక్ష్మి
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అనుచరులు మేయర్ విజయలక్ష్మిని అడ్డుకోవడంతో ఈ శంకుస్థాపన కార్యక్రమాలు ఆగిపోయాయి. నిన్నటికి నిన్న మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు మంత్రి తీరుపై తిరుగుబాటు ప్రకటించి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలు తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష వైఖరికి నిరసనగా వారు తిరుగుబాటు ప్రకటించారు. ఇక తాజాగా మేయర్ విజయలక్ష్మిని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడంతో బేతి సుభాష్ రెడ్డి కి, మేయర్ విజయలక్ష్మి కి మధ్య ఉన్న కలహాలు స్పష్టం అవుతున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య అంతర్గత కలహాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications