
ఫలించని బుజ్జగింపులు: ఆగస్ట్7న టీఆర్‌ఎస్‌కు ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాజీనామా; బీజేపీలో చేరిక ఫిక్స్!!
వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగలబోతుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. ఎర్రబెల్లి ప్రదీప్ రావు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా వార్తల నేపధ్యంలో ఆయన తాజాగా అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఆ సమావేశాలలో ఆయన తన ఆవేదన వెళ్లగక్కుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 7వ తేదీన టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రకటించారు.

టిఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే: ఎర్రబెల్లి ప్రదీప్ రావు
టిఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే అని అందుకే తాను పార్టీని వీడుతున్నట్లు ఎర్రబెల్లి ప్రదీప్ రావు వెల్లడించారు. పార్టీ కార్యకర్తలతో తన అనుచరులతో సమావేశం నిర్వహించిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు పార్టీలో ఎన్నో అవమానాలను భరించాను అంటూ పేర్కొన్నారు. చివరికి తనను నమ్ముకున్న కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టే పరిస్థితి వచ్చినా, అధిష్టానం తనకు మద్దతుగా లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్నప్పటికీ తనకు ఎలాంటి న్యాయం జరగలేదని ఎర్రబెల్లి ప్రదీప్ రావు వెల్లడించారు.

ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ అవకాశం కూడా లేదు
పార్టీలో తనకు కనీస గుర్తింపు లేదని, ఈ పరిణామాలను భరించలేకనే తను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో చెప్పారు. ఇక తెలంగాణ ఉద్యమంలో తన చురుకైన పాత్రను పోషించానని చెప్పిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు తాను ఏర్పాటు చేసిన తెలంగాణ నవనిర్మాణ సమితి పార్టీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారని గుర్తు చేశారు. వరంగల్ తూర్పు టిక్కెట్ ఇస్తామని చెప్పి రెండుసార్లు ఇవ్వకుండా తనను అవమానించారని, ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఇన్సల్ట్ చేశారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆరోపించారు. రాజకీయంగా కష్టపడి పని చేసే వారిని ఆదరించి, మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన పార్టీలోనే చేరదామని ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు.

రంగంలోకి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య; ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు బుజ్జగింపులు
మొత్తానికి ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎపిసోడ్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఎర్రబెల్లి ప్రదీప్ రావును బుజ్జగించడం కోసం టిఆర్ఎస్ పార్టీ బస్వరాజు సారయ్యను చర్చలు జరిపేందుకు పంపించినా లాభం లేకపోయింది. వరంగల్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ ప్రదీప్ నివాసానికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినా, కెసిఆర్ మీతో మాట్లాడతారని ఫోన్ కలిపి ఇచ్చినా ఆయన మాట్లాడలేదని సమాచారం.

చల్లబడని ఎర్రబెల్లి ప్రదీప్ రావు.. టీఆర్ఎస్ రాజీనామావైపే మొగ్గు
ఇక ఎర్రబెల్లి ప్రదీప్ రావును బుజ్జగించేందుకు వెళ్ళిన బస్వరాజు సారయ్య ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ లోనే కొనసాగాలని తనతో మాట్లాడామని, సీఎం కేసీఆర్ కూడా పార్టీలో ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారని పేర్కొన్నారు. ఎంతగా బుజ్జగించినా ఎర్రబెల్లి ప్రదీప్ రావు తన నిర్ణయాన్ని మార్చుకోవటం లేదని తెలుస్తుంది. ఈ నెల ఏడవతేదీ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది.