ఎమ్మెల్యేల ఎరకేసులో సీఎం కేసీఆర్ బిగ్ మిస్టేక్ వల్లే సీబీఐ ఎంట్రీ.. వాట్ నెక్స్ట్!!
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకున్నది ఒకటైతే అయ్యింది మాత్రం వేరొకటి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ బిజెపిని ఇరికించారని భావించిన బి ఆర్ ఎస్ కు ఇప్పుడు సిబిఐ ఎంట్రీతో అనుకోని కష్టాలు వచ్చిపడ్డాయి. అంతా పక్కా ప్లాన్ గా చేసినప్పటికీ, సీఎం కేసీఆర్ చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయ్యేదాకా తీసుకు వచ్చింది అన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికరంగా సాగుతుంది.

కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు ఎలా బయటపెడతారని ప్రశ్నించిన హైకోర్టు
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారాన్ని సిట్ చేతినుంచి సిబిఐ చేతికి అప్పగించింది హై కోర్ట్. అయితే దీనికి బలమైన కారణం చెప్పిన హైకోర్టు ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రమేయం ఉందని, ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కేసుపై ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొంది. అందుకు కారణాలను కూడా ఉటంకించిన హైకోర్టు కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు బయటపెట్టిన అంశాన్ని ప్రస్తావించింది. సీఎం కేసీఆర్ కు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారు అనేది చెప్పటంలో సిట్ విఫలమైందని హైకోర్టు పేర్కొంది.

సిట్ దర్యాప్తు సరిగా లేదని అభిప్రాయం
కోర్టుకు ఇవ్వవలసిన సాక్ష్యాలను సీఎం కేసీఆర్ ఏ విధంగా బయటపెడతారని ప్రశ్నించిన హైకోర్టు, సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు విడుదల చేయడం సమంజసం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడాన్ని కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటి వరకు విచారణ జరిపిన సిట్ సరైన విచారణ జరగలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు సిట్ దర్యాప్తు ను రద్దు చేస్తూ, కేసును సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తారని తీర్పు వెల్లడించింది.

సీబీఐకి కేసు అప్పగించటం వెనుక 45 కారణాలు
అంతే కాదు తన తీర్పులో ఈ కేసును సీబీఐకి అప్పగించగా వెనుక 45 కారణాలను కూడా ధర్మాసనం పేర్కొంది. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలను బయట పెట్టడమే ఇప్పుడు కేసు రివర్స్ గా బీఆర్ఎస్ కు చుట్టుకోవడానికి కారణమని తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తమ పార్టీ నేతలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నం చేసిందని గుర్తించి, ఆ ప్రయత్నాన్ని ఆధారాలతో సహా పట్టుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్, అంత ప్లాన్ ప్రకారం చేసి ఆధారాలను బయటపెట్టడం ద్వారా అనవసరంగా సిబిఐ ఎంటర్ కావడానికి అవకాశం ఇచ్చారు అన్న చర్చ పార్టీ నేతల్లో కూడా వ్యక్తమవుతోంది.

తెలంగాణా సీఎంను సీబీఐ విచారిస్తుందా? వాట్ నెక్స్ట్
ముఖ్యంగా కోర్టు కెసిఆర్ ఆధారాలను బయటపెట్టడం పై అనేక ప్రశ్నలను సంధించడంతో, ఈ కేసులో సీబీఐ అధికారులు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది అన్న చర్చ జరుగుతుంది. కెసిఆర్ చేతికి ఆధారాలు ఎలా వెళ్లాయి? ఎవరిచ్చారు? ఏ విధంగా కెసిఆర్ ఆధారాలను సేకరించారు? ఆయన ప్రెస్ మీట్ పెట్టి వీడియో లను చూపించి, ఆధారాలను బయట పెట్టాల్సిన అవసరం ఏమిటి? వంటి అనేక విషయాలపై సీఎం కేసీఆర్ ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని, తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు? సిబిఐని అడ్డుకోవడానికి నెక్స్ట్ స్టెప్ ఏం వేయబోతున్నారు? అన్న అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications