గన్ తో బెదిరించి మహిళా కానిస్టేబుల్‌పై ఎస్ఐ అత్యాచారం: డిస్మిస్ చేసిన సర్కారు
జయశంకర్ భూపాలపల్లి: ఓ మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడిన ఎస్ఐ కటకటాలపాలయ్యారు. కాటారం పోలీస్ డివిజన్ మహాదేవపూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానిసేన్పై అత్యాచారం కేసు నమోదైంది. కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవానిసేన్ మహిళ కానిస్టేబుల్‌ను అత్యాచారం, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అదే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌పై వరుసగా హత్యాచారం చేసి, లైంగిక వేధింపులకు గురిచేశాడు. అంతేగాక, ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీని కలిసి ఆమె తనకు జరిగిన దారుణాన్ని వివరించింది.

ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలతో కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐలతో విచారణ చేపట్టారు. ఆ తర్వాత నిందితుడైన ఎస్ఐపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్సై భవానీ సేన్‌ను పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు. అతని సర్వీస్ రివాల్వర్‌ను సైతం పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి భవానీసేన్ సస్పెన్షన్‌కు గురికావడం గమనార్హం.
ఎస్ఐ డిస్మిస్
ఎస్ఐ భవానీ సేన్ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఎస్ఐ భవానీ సేన్ ను విధుల నుంచి డిస్మస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కానిస్టేబుల్ పై లైంగికంగా వేధించినట్లు నిర్ధారణ కావడంతో ప్రభుత్వం ఈ మేరకు కఠిన చర్యలు తీసుకుంది. 311 ఆర్టికల్ ప్రకారం సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications