ఉప్పల్ నుండి ఎల్బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం!నాగోల్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్!
హైదరాబాద్: హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న కొద్ది అంతకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఉందని, భావి తరాల వారికి ఎలాంటి సమస్యలు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు రాష్ట్ర మున్సిపల్, పరిపాలన పట్టణాభివృద్ధి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు స్పష్ఠం చేసారు. సిగ్నల్ రహిత, మెరుగైన రవాణా వ్యవస్థను పటిష్టం చేయడానికి జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు.

ప్రజలకు అందుబాటులో నాగోల్ ఫ్లైఓవర్..
ట్రాఫిక్ చికాకు లేని ప్రయాణం.. ప్రజలకు అందుబాటులో నాగోల్ ఫ్లైఓవర్..
ఫ్లోఓవర్ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ...ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎస్.ఆర్.డి.పి కార్యక్రమాన్ని రూ. 8వేల52 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టామని అన్నారు. నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు. మొత్తం 32 ప్రాజెక్టులు పూర్తికగా 16 ఫ్లై ఓవర్లు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గతంలో చాలా ట్రాఫిక్ కష్టాలు ఉండేటివి ఇప్పుడు అవి తగ్గిపోయావని గుర్తు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు మంత్రి కేటీఆర్.

ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
తీరిన నాగోల్ ట్రాఫిక్ తిప్పలు.. ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
యుటిలిటీ షిఫ్టింగ్, భూసేకరణ, ప్రాజెక్టుతో కలిపి మొత్తం 143.58 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ 990 మీటర్ల పొడవుతో 6 లైన్ల, బై డైరెక్షన్ తో నిర్మించారు. దీని వలన ఉప్పల్ నుండి ఎల్బీ నగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా వలన వాహన దారులకు అనేక ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా కాలుష్యం తగ్గుదల, వాహన వేగం పెరిగి గమ్యస్థానానికి సకాలంలో చేరుతారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆరంఘర్, ఎల్బీనగర్ మీదుగా ఉప్పల్ వరకు అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సులభతరం అవుతుంది. దీంతో ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన పనులలో 16వ ఫ్లై ఓవర్ గా నాగోల్ చేరుతుందని అధికారులు వివరించారు.

స్పష్టం చేసిన మంత్రి..
మరో రెండు ఫ్లైఓవర్లు త్వరలో ప్రారంభం.. స్పష్టం చేసిన మంత్రి..
అంతే కాకుండా రాబోయే నాలుగైదు నెలల్లో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చూస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎల్బీనగర్ ప్రాంతంలో రూ. 600 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య లేకుండా చేశామని అన్నారు. హైదరాబాద్ నగరం భారత దేశంలో శరవేగంగా ఎదుగుతున్న నగరమని, భవిష్యత్ తరాలకు మెరుగైన వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. హరితహారంలో మనం తీసుకున్న చర్యల్లో భాగంగా ప్రపంచంలోనే చాలా నగరాలను వెనక్కి నెట్టి వరల్డ్ గ్రీన్ సిటీ గా హైదరాబాద్ కు గుర్తింపు వచ్చిందని, మౌలిక వసతులతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

విశ్వ నగరం దిశగా హైదరాబాద్.. మరిన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తామన్న కేటీఆర్..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంఎల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి మల్లా రెడ్డి, ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యగ్గే మల్లేష్, దయానంద్, జనార్థన్ రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మరియు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగోల్ ఫ్లై ఓవర్ 990 మీటర్ల పొడవుతో 6 లైన్ల, బై డైరెక్షన్ తో నిర్మించడం రాబోవు తరాలకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని, అమరావతి, నాగార్జున సాగర్, ఖమ్మం, వెళ్లే ప్రయాణీకులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసారు. అవాంతరాలు లేని ప్రయాణం కోసం మరిన్ని ఫ్లైఓవర్లకు రూపకల్పన చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications