సింగరేణి ఎన్నికల ఫలితాలు: ఐఎన్టీయూసీ హవా, సత్తా చాటిన ఏఐటీయూసీ
ఏడాదిన్నర కాలంగా ఎదురుచూస్తున్న సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు బుధవారం జరిగిన విషయం తెలిసిందే. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలోని 11 డివిజన్లలో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. కాగా, 94.15 శాతం పోలింగ్ నమోదైంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి.
కొత్తగూడెం కార్పొరేట్ పరిధి మణుగూరు సింగరేణిలో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. బెల్లంపల్లి సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపొందింది. ఐఎన్టీయూసీపై 122 ఓట్ల తేడాతో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఇల్లెందు డివిజన్ లో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ విజయం నమోదు చేసింది. ఇక్కడ సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీపై 46 ఓట్ల తేడాతో ఐఎన్టీయూసీ విజయం సాధించింది.

రామంగుండం డివిజన్ 1,2లో ఏఐటీయూసీ, రామగుండం 3లో ఐఎన్టీయూసీ గెలుపొందాయి. కాగా, ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా.. సింగరేణి విస్తరించివున్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎన్నిక జరిగింది. రహస్య బ్యాలెట్ విధానంలో జరిగిన ఓటింగ్ లో బుధవారం అర్ధరాత్రి వరకు లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 700 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు.
అయితే, ప్రస్తుతం గుర్తింపు టీజీబీకేఎస్ ప్రధాన నాయకత్వం ప్రచారానికి దూరంగా ఉండటంతో ద్వితీయ శ్రేణి నాయకులు అంతంతమాత్రంగానే ప్రచారం చేపట్టారు. ఇక ఐెన్టీయూసీ తరపున కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రచారం నిర్వహించారు. మరోవైపు, ఏఐటీయూసీ, సీఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ సంఘాల నాయకులు కూడా ప్రచారం చేశారు. అయితే, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీలు మాత్రమే ఎన్నికల ఫలితాలుల్లో సత్తా చాటాయి.












Click it and Unblock the Notifications