12 కేసులు, నయీం భార్య హసీనా సహా 18 మంది అరెస్ట్: సిట్ ఛీఫ్ నాగిరెడ్డి
హైదరాబాద్: నయీం కేసు వ్యవహారంలో మొత్తం 12 కేసులు నమోదు చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు అధికారి నాగిరెడ్డి వెల్లడించారు. కేసు దర్యాప్తులో కొనసాగుతున్న పురోగతిని ఆయన గురువారం సాయంత్రం మీడియాకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 599 ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.
ఈ డాక్యుమెంట్లు అన్ని కూడా నయీం అనుచరులు, కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయబడ్డాయని ఆయన తెలిపారు. నయీం భార్య హసీనా సహా 18 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అలాగే సంఘటనా స్థలంలో భువనగిరికి చెందిన సలీమాబేగం, మిర్యాలగూడకు చెందిన మతీన్ భార్య ఖలీమ పోలీసులు అరెస్ట్ చేశారు.

నయీం ఇంట్లో చేసిన సోదాలతో పాటు కుటుంబ సభ్యులు, బంధువల ఇళ్ల నుంచి 2 కిలోల బంగారంతో పాటు రూ. 2.61 కోట్లు సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 19 ఆయుధానలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఎన్ కౌంటర్ జరిగిన ఇంటి నుంచి రెండు ఏకే-47 గన్లు, స్టెన్ గన్, 4 రివాల్వర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
17 సెల్ ఫోన్లు, మారుతీ డిజైర్, హోండా అమేజ్, స్కూటీ ని సీజ్ చేశారు. రూ.3.74 లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారం, వ్యవసాయ భూములకు సంబంధించిన 121 డాక్యుమెంట్లు స్వాధీనపరుచుకున్నామని చెప్పారు.
నయీం అరాచకంలో ఎవరైనా బాధితులు ఉంటే వారు నేరుగా పోలీసులను సంప్రదించవచ్చని అన్నారు. అన్ని కేసులను కూడా సిట్‌కే బదిలీ చేసి విచారించడం జరుగుతుందని అన్నారు. సైబరాబాద్ ఆఫీసులో సిట్ కార్యాలయం ఏర్పాటై ఉందని, బాధితులు నేరుగా అక్కడికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.
అలా కాకుండా ఫోన్ ద్వారాగా కూడా సమాచారం తెలియజేయవచ్చని అన్నారు. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు. ఇక అల్కాపురిలోని నయీం బెడ్‌రూంలో జరిపిన తనిఖీల తరువాత స్వాధీనం చేసుకున్న స్వాధీనం చేసుకున్న రూ. 2.08 కోట్ల నగదును రాజేంద్రనగర్ న్యాయస్థానంలో పోలీసులు డిపాజిట్ చేశారు.
కోర్టు ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ వర్సిటీలోని ఎస్‌బీహెచ్ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు నార్సింగ్ పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో నయీం సంబంధాలపై డీజీపీ ఆదేశిస్తే విచారిస్తామని ఆయన అన్నారు. కాగా నయీం ఇంట్లో అదుపులోకి తీసుకున్న 9 మంది చిన్నారులను మహబాబ్ నగర్‌లోని బాలసదన్‌కు పోలీసులు తరలించారు.












Click it and Unblock the Notifications