ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ఆ రెండు ఫోన్లు సంచలనం
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ6 గా ఉన్న ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు అరువెల శ్రవణ్‌రావు ఇవాళ మరోసారి సిట్ విచారణను ఎదుర్కోనున్నారు. విచారణలో శ్రవణ్ రావు వినియోగించిన రెండు ఫోన్లు కీలకం కానున్నాయి. ఇప్పటికే శ్రవణ్ రావు రెండు సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు.
సిట్ విచారణలో భాగంగా గత ఎన్నికల సందర్భంగా శ్రవణ్ రావు వాడిన ఫోన్లను స్వాధీనం చేయాలని సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రెండోసారి సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు ఓ పాత తుప్పు పట్టిన ఫోన్ ఇచ్చారు. ఆ తుప్పు పట్టిన ఫోన్‌ను చూసిన విచారణ అధికారులు విస్మయానికి గురయ్యారు. సుప్రీంకోర్టు స్పష్టంగా సిట్ విచారణకు సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించినా శ్రవణ్ రావు సహకరించకపోవడంపై సిట్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తాము అడిగిన రెండు సెల్ ఫోన్లతో పాటు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానంతో ఈనెల 8వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని ఈమేరకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చింది. దీంతో ఇవాళ ఆయన సిట్ ఎదుట హాజరు కానున్నారు.
అయితే.. ఈ కేసులో ఇప్పటికే భుజంగరెడ్డి, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, తిరుపతన్న అరెస్టు అయి బెయిల్ పై విడుదలయ్యారు. కేసు తెర మీదకు రాగానే శ్రవణ్‌రావు విదేశాలకు పరారయ్యరు. దీంతో ఆయన స్వదేశానికి వచ్చి విచారణకు హాజరై పోలీసులకు సహకరించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఆయన జూబ్లీహిల్స్ ఠాణాకు వచ్చారు.
అయితే ఫోన్ ట్యాపింగ్ కోసం పరికరాలు ఎవరు సమకూర్చారు, సర్వర్ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారు అనే కోణాల్లో సిట్ శ్రవణ్‌రావును విచారించింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించారు. దీంతో ఇవాళ ఆయన సిట్ ఎదుట మరోసారి హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications