నయీం కేసులో కొత్త కోణం: మొత్తం 24 మంది, పోస్టుమార్టం చేసిన వైద్యులకు నోటీసులు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసులో విచారణను సిట్ అధికారులు వేగవంతం చేశారు. నయీం ఇప్పటి వరకు 24 మందిని హత్య చేసినట్లు అధికారులు గుర్తించారు. అందులో నాలుగు హత్య కేసుల్లో వైద్యులు పోస్టుమార్టం నివేదికలు తప్పుగా ఇచ్చినట్లు అధికారులు తేల్చారు.

న్యాయస్థానాన్ని మోసం చేసిన వైద్యులను కూడా విచారించాలని సిట్ భావిస్తోంది. నాలుగు హత్యలను సాధారణ మృతులుగా చూపిన వైద్యల పాత్రపై సిట్ అధికారులు విచారణ జరపనున్నారు. ఇందులో భాగంగా పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులకు నోటీసులు ఇవ్వాలనే యోచనలో సిట్ అధికారులు ఉన్నారు.
మరోవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు సిట్ లేఖ రాసింది. నయీం సహకారంతో కజ్జాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది. ఈ కేసులో రాజకీయ నాయకులు, పోలీసుల ప్రమేయంపై మరిన్ని ఆధారాల గురించి ఆరా తీస్తోంది. అందుకోసం ఆధారాల సేకరణకు రెండు టీమ్‌లను ఏర్పాటు చేశారు.
అలాగే నయీం కేసులో రాజకీయ నాయకుల లింక్‌లపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధుల ప్రమేయంపై అసెంబ్లీ సమావేశాల లోపు తేల్చాలని యోచిస్తోంది. పూర్తి ఆధారాలు లభ్యమైన తర్వాత రాజకీయ నాయకులకు నోటీసులు అందజేసి, వారిని విచారిస్తామని సిట్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నయీం కేసులో కీలక విషయాలను రాబట్టేందుకు నయీం భార్యను పోలీసు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసు పిటిషన్‌ను విచారించిన కోర్టు సానుకూలంగా స్పందించింది. దీంతో నయీమ్ భార్య హసీనా, మేనకోడలు షాదితా షాహిన్‌లను నార్సింగ్ పోలీసులు ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి ఈనెల 26 వరకు నార్సింగ్ పోలీసులు వారిని ప్రశ్నించనున్నారు.
పుప్పాలగూడలోని నయీం ఇంట్లో యువతి నస్రీన్ హత్యకు సంబంధించిన వివరాలు రాబట్టేందుకు వారిని కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎదురు చెప్పిందనే కారణంతో నస్రీన్‌ను నయీం హత్యచేసి మంచిరేవుల వద్ద పాతిపెట్టిన సంగతి తెలిసిందే.
నయీం కేసులో ఇప్పటివరకూ 99కేసులో నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకూ లభించిన డాక్యుమెంట్లు, కీలక ఆధారాలను నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు.












Click it and Unblock the Notifications