సాప్ట్‌వేర్ ఉద్యోగి ఇంట్లో చోరీ: టీవీతో సహా 30 తులాల బంగారం ఎత్తుకెళ్లారు
హైదరాబాద్: సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలను పగులగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి వస్తువులతో పాటు టీవీని కూడా దుండగులు అపహరించుకు పోయిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడుప్పల్‌లో చోటు చేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పోచారంలో ఉన్న జెన్‌పాక్ట్ కంపెనీలో పనిచేస్తున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్ హనిత్ సింగ్ బోడుప్పల్ లోని అంజయ్య ఎన్ క్లేవ్‌లో నివసిస్తున్నాడు. భార్య జ్యోతి ఊరెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న హనిత్ సింగ్ బుధవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లారు.

గురువారం ఉదయం వచ్చి చూడగా ఇంటి తాళాలు పగుల గొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో దాచిన 30 తులాల బంగారు నగలు, 30 తులాల వెండి వస్తువులతో పాటు ఎల్‌ఈడీ టీవిని కూడా దుండగులు ఎత్తుకుపోయారు. ఇంట్లోని మిగతా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి.
దీంతో వెంటనే ఇంట్లో చోరీ జరిగిందని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి పిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications