పండగ పూట అత్తారింటి వద్ద దిక్కుమాలిన పని చేసిన అల్లుడు..!
సంక్రాంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా కూడా అంబరాన్ని అంటేలా జరుపుకున్నారు. కానీ మద్యం మత్తుకి తోడు క్షణికావేశం రెండు కుటుంబాల్లో పండుగ పూట విషాదం నింపింది. భార్యను తనతో పంపించలేదన్న కోపంతో ఓ అల్లుడు అత్తమామల ఇంటికి నిప్పుపెట్టిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ దారుణ ఘటన తెలంగాణ లోని సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలో చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగిందంటే..
నిజాంపేట గ్రామానికి చెందిన పిట్లం బాలయ్య కుమార్తె సాయవ్వకు సుమారు 15 ఏళ్ల క్రితం రవితో వివాహం జరగ్గా.. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే రవి మద్యం బానిస కావడం, అదే సమయంలో నిత్యం భార్యతో గొడవలు పడటం వల్ల కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. భర్త వేధింపులు భరించలేక సాయవ్వ తన పుట్టింటికి వెళ్లిపోయింది. సమస్యను పరిష్కరించేందుకు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. రవి ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో సాయవ్వ పుట్టింట్లోనే ఉండిపోయింది.

ఈ క్రమంలో గురువారం రాత్రి రవి అత్తమామల ఇంటికి వెళ్లి భార్యను తనతో పంపించాలని గొడవకు దిగాడు. అత్తమామలు అందుకు నిరాకరించడంతో రవి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. కోపంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇంటిపై పోసి నిప్పు పెట్టాడు. మంటలు వేగంగా వ్యాపించి ఇంటి ముందు నిలిపిన బైక్ కూడా పూర్తిగా దగ్ధమైంది. అయితే మంటలు చెలరేగుతున్న సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వెనుక తలుపు ద్వారా బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది.
స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఘటన అనంతరం రవి అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ అనూహ్య ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications