భార్యను కాపురానికి పంపలేదని అత్తంటిపై అల్లుడు కత్తులతో దాడి, ఇద్దరు మృతి
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదని ఆగ్రహించిన అల్లుడు అత్తవారింటిపై దాడి చేశాడు. ఆదివారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే, సారంగాపూర్ గ్రామానికి చెందిన శివమ్మకు నర్సింహులుతో నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో శివమ్మ గత కొంతకాలంగా తల్లిగారింట్లో ఉంటుంది.
భర్త నరసింహులు కాపురానికి రమ్మని పలు మార్లు రమ్మని కోరినా ఆమె నిరాకరించింది. దీంతో అత్తవారింటిపై కక్ష పెంచుకున్న అల్లుడు నర్సింహులు ఆదివారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తున్న సమయంలో కత్తులతో ఇంట్లోకి ప్రవేశించి భార్యపై దాడి చేయడానికి ప్రయత్నించాడు.

ఆమె తప్పించుకుంది. ఈ క్రమంలో బావమరిది (28) నర్సింహులును అడ్డుకునేందుకు ప్రయత్నించగా అతనిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి హతమార్చాడు. మధ్యలో అడ్డొచ్చిన అతని భార్య సుశీల(26)ను కూడా కత్తితో పొడిచాడు.
అడ్డొచ్చిన అత్త లక్ష్మి(50), మామ(55)ల పై కూడా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంతలో ఇది గమనించిన స్థానికులు నర్సింహులను పట్టుకోవడానికి ప్రయత్నించగా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications