తెలుగు సిఎంలకు సన్ స్ట్రోక్స్: పరిపూర్ణానంద జోస్యం
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖరరావులకు వారి కుమారుల కారణంగా కష్టాలు ఎదురవుతాయని స్వామి పరిపూర్ణానంద జోస్యం చెప్పారు. ఉభయరాష్ట్రాల్లో వర్షాలు ప్రథమార్థంలో కాకుండా ద్వితీయార్థంలో విస్తారంగా కురుస్తాయని ఆయన అన్నారు.
ఈ ఏడాది ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని, ఉష్ణోగ్రతలు బాగా పెరగడంలో జననష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. శుక్రవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం కళ్యాణ మండపంలో జంటనగరాల ఆర్యవైశ్య సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ పఠన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
సమాజంలో ఆధ్యాత్మిక భావనలేమి పెరగటం వల్ల మానసిక బలం తగ్గిపోతుందని పరిపూర్ణానంద చెప్పారు. ప్రజలు శివాలయాలను దర్శించి, పంచాక్షరిని పఠించాలని హితవు చెప్పారు. ఈ సంవత్సరం విచిత్రమైన కొత్త రోగాలు ప్రబలుతాయన్నారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం భారతీయ సంస్కృతిపై ఒక గొప్ప ప్రకటన చేసే అవకాశం ఉందని తెలిపారు. పరిశోధన రంగంలో భారతదేశం నుంచి ఒక మంచి విజ్ఞానవేత్త ప్రపంచానికి మార్గదర్శకం చేసే అవకాశం ఉందని తెలిపారు.

గోరక్షణ, గోశాలలు వృద్ధిచెంది, గోఆధారిత సేద్యం వృద్ధి చెందుతుందన్నారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణాలు చోటు చేసుకుంటాయని, అంతర్గత భద్రత విషయంలోను ఆందోళనలు పెచ్చుమీరుతాయని చెప్పారు. బాంబుదాడులు ఉగ్రమూకల అల్లర్లు పెరిగిపోతాయని, అయినప్పటికి ప్రభుత్వాలు వీటిని సమర్థంగా ఎదుర్కొంటాయని చెప్పారు.
ఐసిస్ లాంటి సంస్థల్లోని ఉగ్రవాదులు హైదరాబాదు నగరానికి చెందిన వారు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థలో ప్రముఖ స్థానంలో ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా రాకపోగా కేంద్రంతో ఉన్న సంబంధాలు బలహీనపడే అవకాశం ఉందన్నారు.
ప్రధాని మోడీ తల్లికి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదంతోపాటు, ప్రధాని సైతం మానసిక క్షోభ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సెప్టెంబర్, నవంబర్ మాసం నుంచి కొత్తప్రణాళికలతో ప్రధాని ప్రజాదరణ పొందనున్నారని పరిపూర్ణానంద తెలిపారు.












Click it and Unblock the Notifications