ఖమ్మం బరిలో సోనియా గాంధీ, - రేవంత్, షర్మిలకు బాధ్యతలు: గేమ్ ఛేంజర్..!!
తెలంగాణలో గెలిచిన తరువాత కాంగ్రెస్ హైకమాండ్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఏపీలో షర్మిల ఎంట్రీతో తాజా మార్గనిర్దేశం చేసింది. కర్ణాటక, తెలంగాణ లో విజయం తరువాత దక్షిణాదిన పట్టు నిలబెట్టు కోవాలని ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయటం వలన రెండు తెలుగు రాష్ట్రాలపైన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలకు హైకమాండ్ నుంచి సమాచారం అందింది.
తెలంగాణ నుంచి పోటీ: తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కొంత కాలంగా రాష్ట్ర పార్టీ నాయకత్వం కోరుతోంది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి, అధిష్ఠానానికి పంపగా, ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్దత కొనసాగింది. తాజాగా ఈ విషయంలోనూ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. సోనియా ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు.

ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు, పార్టీలో చేరిన వేళ షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఖమ్మం నుంచి పోటీ ద్వారా తెలంగాణలోనే కాకుండా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోనియా కార్యాలయం నుంచి రాష్ట్ర నేతలకు సానుకూల సందేశం అందింది.
ఖమ్మం సీటు ఖరారు: రాష్ట్రం నుంచి పోటీ చేయడానికి ఆమె అంగీకరించారని, అందుకు తగ్గట్టుగా కార్యాచరణను రూపొందించాలని సూచించారని సమాచారం.ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో సోనియా పోటీకి సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర నేతలు దృష్టి సారించారు.
సోనియా పోటీ కోసం పలు లోక్‌సభ స్థానాలను పరిశీలించినప్పటికీ చివరకు ఖమ్మం నుంచి రంగంలోకి దించాలనే నిర్ణయానికి వచ్చారు. ఖమ్మం ఎంపికలో పలు అంశాలు పని చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇతర నియోజక వర్గాలతో పోలిస్తే ఇక్కడ కాంగ్రెస్ చాలాబలంగా ఉంది. ఎన్నికల సమయంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, ఆ సభకు సోనియాగాంధీని ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు.

రెండు రాష్ట్రాలపై ప్రభావం: సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆమె దక్షిణాది నుంచి పోటీ చేయడం ఇది రెండోసారి అవుతుంది. గతంలో 1999లో కర్ణాటకలోని బళ్లారి నుంచి సోనియాగాంధీ పోటీచేసి బీజేపీ నేత సుష్మా స్వరాజ్‌పై విజయం సాధించారు. తర్వాత మళ్లీ పాతికేళ్లకు సోనియా దక్షిణాదిలో భాగమైన ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇందిరాగాంధీ కూడా గతంలో కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి పోటీ చేశారు.
1978లో కర్ణాటకలోని చిక్‌మగళూరు నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 1980లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలోని మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సోనియా ఖమ్మం నుంచి బరిలోకి దిగితే బీజేపీకి స్థానికంగా బలం అంతంతమాత్రంగా ఉండటం..బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే లెక్కలతో ఇప్పుడు ఖమ్మం సీటు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications